3 రోజుల పాటు నిర్బంధించి పర్యాటకురాలిపై అత్యాచారం

30 Apr, 2017 02:09 IST|Sakshi
3 రోజుల పాటు నిర్బంధించి పర్యాటకురాలిపై అత్యాచారం

- నగ్న వీడియోలను తీసిన నిందితులు.. ఒకరి అరెస్టు
- సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో ఘటన...


హైదరాబాద్‌: రాజధానిలో దారుణం... నగర అందాలను వీక్షించడానికి కోల్‌కతా నుంచి వచ్చిన ఓ యువతిని నిర్బంధించి మూడు రోజులపాటు అత్యా చారానికి పాల్పడ్డారు కామాంధులు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుల్లో ఒకరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌ మారేడుపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కోల్‌కతాకు చెందిన బీకాం విద్యార్థిని (19) ఫిబ్రవరి 14న నగర పర్యటన నిమిత్తం శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగింది.

సికింద్రాబాద్‌ పార్క్‌ హోటల్‌కు షేరింగ్‌ క్యాబ్‌ ఎక్కింది. క్యాబ్‌లో ఉన్న మరో మహిళ పింకీ రాయ్‌... తానూ పర్యాట కానికి వచ్చానని యువతితో చెప్పి పరిచయం పెంచుకుంది. నమ్మిన యువతి పింకీరాయ్‌ హోటల్‌ కు వెళ్లింది. ఫిబ్రవరి 15న ఇద్దరూ కలసి నగరంలో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో తన స్నేహితుడు ప్రీత్‌షార్గిల్‌ అలియాస్‌ రాజ్‌వీర్‌సింగ్‌కు కారు ఉందని, అందులో వెళదామని పింకి చెప్పింది. నమ్మిన యువతి పింకీతో కలసి రాజ్‌వీర్‌ కారు ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తరువాత పింకి... పని ఉందని, సాయంత్రం హోటల్లో కలుస్తానని చెప్పి దిగిపోయింది.

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి...
రాజ్‌వీర్‌... ఈస్ట్‌ మారేడుపల్లి మిషా మాన్‌సూ న్‌లోని తన అపార్టుమెంట్‌కు యువతిని తీసుకు వెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి వద్దనున్న రూ.7వేల నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు రాజ్‌వీర్‌ డ్రైవర్‌ సుల్తాన్‌ అలియాస్‌ నీరజ్, ఆ తరువాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి యువతిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు రోజుల అనంతరం మళ్లీ అత్యాచారం చేసి, నగ్న చిత్రాలను వీడియోలో బంధించి, వారి స్నేహితులకు పంపారు.

టిష్యూ పేపర్‌పై రాసి...
కాగా, ఫిబ్రవరి 18న తన తండ్రికి సమాచారం ఇవ్వాలంటూ బాధితురాలు తన వివరాలను గదిలో ఉన్న టిష్యూ పేపర్‌పై రాసి పక్కింటిలో పడేసింది. ఇది గమనించిన నిందితులు భయంతో ఆమెను వెంటనే క్యాబ్‌లో శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకువెళ్లి వదిలేశారు. బాధితురాలు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కమిషనర్‌ ఆదేశాలతో మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు.

పరారీలో నిందితులు...
మిషా మాన్‌సూన్‌ అపార్టుమెంట్‌పై నిఘా పెట్టిన పోలీసులు శనివారం రాజ్‌వీర్‌సింగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా గుర్తించారు. పింకీరాయ్, సుల్తాన్‌తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు