సహకార సంఘాలకు ఆర్‌బీఐ ఝలక్‌

28 Jun, 2017 03:39 IST|Sakshi
సహకార సంఘాలకు ఆర్‌బీఐ ఝలక్‌
సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు స్వీకరించొద్దని హెచ్చరిక
 
సాక్షి, హైదరాబాద్‌: సభ్యులు కాని వారి నుండి డిపాజిట్లను స్వీకరించొద్దని సహకార సంఘాలకు రిజర్వు బ్యాంకు హెచ్చరికలు జారీచేసింది. సహకార సంఘాల్లో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుంచి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని రిజర్వు బ్యాంకు రీజనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.సుబ్రమణియన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సహకార సంస్థలకు బ్యాంకింగ్‌ వ్యాపారం చేయడానికి రిజర్వుబ్యాంకు బి.ఆర్‌. యాక్ట్‌ను అనుసరించి ఎటువంటి లైసెన్స్‌ను జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. అటువంటి అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు. ఇటువంటి సహకార సంఘాల్లో డిపాజిట్‌ చేసిన సొమ్ముకు ఎటువంటి బీమా కవరేజ్‌ లేదని ఆయన స్పష్టంచేశారు. ప్రజలు ఈ విషయాలను గమనించి సహకార సంఘాల్లో డిపాజిట్ల విషయంలో జాగ్రత్త వహించాలని సుబ్రమణియన్‌ తెలిపారు. 
 
రూ. వెయ్యి కోట్ల డిపాజిట్లు: అనేక సహకార సంఘాలు పొదుపు చేసుకొని తమ సభ్యులకు అప్పులుగా ఇస్తుంటాయి. కొన్ని పెద్ద సంఘాలు సభ్యుల నుంచే కాకుండా సభ్యులు కాని ఇతరుల నుంచి కూడా డిపాజిట్లు సేకరిస్తున్నాయి. అలా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించే అర్హత వాటికి లేదు. ఆర్బీఐ నుంచి వాటికి ఎటువంటి అనుమతి లేదు. రాష్ట్రంలో అలా అక్రమంగా కొన్ని సహకార సంఘాలు రూ. వెయ్యి కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు ప్రాథమిక అంచనా. సహకార శాఖ ఇటీవల తనిఖీలు నిర్వహించినప్పుడు 25 సొసైటీలు రూ. 200 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు తేలింది. కొన్ని పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సొసైటీలే అందులో కీలకంగా ఉన్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సహకారశాఖ ఉన్నతాధికారి శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. 
మరిన్ని వార్తలు