తుంగభద్ర బోర్డు ముందుకు ఆర్డీఎస్‌

17 Apr, 2017 02:01 IST|Sakshi
తుంగభద్ర బోర్డు ముందుకు ఆర్డీఎస్‌

నేడు బెంగళూరులో భేటీ కానున్న బోర్డు, హాజరుకానున్న రాష్ట్ర అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్‌) ఆధునీకరణ పనుల అంశం మళ్లీ తుంగభద్ర బోర్డు ముందు చర్చకు రానుంది. సోమవారం బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర అధికారులు హాజరై, ఆధునీకరణ పనుల వేగిరంపై చర్చించనున్నారు. ఇప్పటికే కెనాల్‌ పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు ఓకే చెప్పడం,హెడ్‌ వర్క్స్‌ పనుల అంచనాల పెంపునకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో పనులకు కర్ణాటక, ఏపీల సహకారం కోరను న్నారు. వాస్తవానికి ఆర్డీఎస్‌ కింద రాష్ట్రానికి 15.9 టీఎంసీల నీటి కేటాయింపులుండగా, పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది.

ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీల మేర నీరు లభ్యమవుతోం ది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవ డంతో ఆశించిన మేరకు నీరు రావడం లేదు. ఈ కాల్వల ఆధునికీకరణ పనులకోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72 కోట్ల మేర చెల్లించింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీ కరణ పనులకు అడ్డు తగులుతుండటంతో 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. ఈ విషయాన్ని గతంలో తుంగభద్ర బోర్డు ముందు ప్రస్తావించగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు  అభ్యం తరం లేదని, ఇందుకు తాము సహకరిస్తా మని ఏపీ స్పష్టం చేసింది.

ఈ హామీ మేరకు గత ఏడాది పనులు ఆరంభించగా, కర్నూలు జిల్లా అధికారులు, నేతలు అడ్డుతగిలారు. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో కర్ణాటక పనులు నిలిపివేసింది. అప్పటి నుంచి పనులు ముందుకు కదల్లేదు. దీంతో మరో మారు ఈ అంశాన్ని బోర్డు ముందు పెట్టి పనులు మొదలు పెట్టించాలనే ఆలోచనలో రాష్ట్రం ఉంది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ సైతం కొత్తగా ఏపీకి తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించిన దృష్ట్యా, ఆ నీటిని ఆర్డీఎస్‌ కుడి కాల్వ ద్వారా తీసుకోవచ్చని రాష్ట్రం చెబుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అయినా పనులకు సహకరించాలని కోరనుంది.

మరిన్ని వార్తలు