పురానాపూల్‌లో నేడు రీ పోలింగ్

5 Feb, 2016 01:19 IST|Sakshi

పూర్తి స్థాయి బందోబస్తు
అన్ని కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్

 
సిటీబ్యూరో: పురానాపూల్ డివిజన్‌కు శుక్రవారం రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 2న పోలింగ్ సందర్భంగా ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో... వివిధ రాజకీయ పార్టీ ల అభ్యంతరాలు.. ఎన్నికల పరిశీల కుల నివేదిక అనంతరం రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో వార్డులోని 36 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుందన్నారు. ఓటరు స్లిప్పులు లేకున్నా స్థానికులు ఓటు వేసేందుకు అనుమతించాల్సిం దిగా అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 36 కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు కానీ... ఫొటోతో కూడిన 21 గుర్తింపు పత్రాల్లో దేనిని చూపించినా అనుమతిస్తారని చెప్పారు. పురానాపూల్ వార్డులో మొత్తం 34,407 మంది ఓటర్లు ఉండగా...  200 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్టు కమిషనర్ చెప్పారు. పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

నేడు సెలవు
రీ పోలింగ్ దృష్ట్యా పురానాపూల్ వార్డు పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ గురువారం జీవో జారీ చేసింది. పోలింగ్ నిర్వహించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారికి, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు  వర్తిస్తుందని కార్మిక శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు.  స్థానిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఓటర్లు: పురుషులు-18,204, మహిళలు-16,203, మొత్తం-34,407.

బరిలో ఉన్న అభ్యర్థులు...
 మజ్లిస్ పార్టీ నుంచి మాజీ కార్పొరేటర్ సున్నం రాజ్‌మోహన్... మరో మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ పోటీలో ఉన్నారు. వీరితో పాటు బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి మక్కర్ యాదవ్, టీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లికార్జున్ యాదవ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  
 

మరిన్ని వార్తలు