రెడి

6 Jan, 2015 23:38 IST|Sakshi
రెడి

ఎవరి కుర్చీ వాళ్లే తెచ్చుకుంటారు. కొందరు సొంతంగా.. ఇంకొందరు అద్దెకు..చెట్ల నీడన, లైబ్రరీ రీడింగ్ రూమ్‌లో తదేక దీక్షతో చదువు.. మధ్యలో డిస్కషన్స్.. మధ్యాహ్నం ‘ఐదు రూపాయలకే భోజనం’తో కడుపు నింపుకొంటారు. పొద్దుపోయే వరకు వాళ్ల చదువుసంధ్యలు అలా సాగిపోతూనే ఉంటాయి. పుస్తకాల్లోని విషయాన్ని మస్తిష్కం నిండా ఎక్కించుకుని.. చివరిగా ఎవరి కుర్చీలు, సరంజామా వాళ్లు తీసుకుని వెళ్లిపోతారు. మళ్లీ తెల్లవారగానే ఇక్కడి చెట్లపై ఉండే పక్షుల్లా పరుగు పరుగున వచ్చేస్తారు.
 ..:: భర్తేపూడి కృష్ణ, వివేక్‌నగర్
 
కొలువులకు ‘నెల’వైన ఈ సమయంలో నిరుద్యోగులు షికార్లు, టైంపాస్ టూర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు వీరి డైరీ నిండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్లాన్సే. ఉద్యోగమే లక్ష్యంగా చదువుకోవడానికో అనువైన ప్లేస్ చూసుకుని నేరుగా ‘సబ్జెక్ట్’లోకి వెళ్లిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) రానున్న రోజుల్లో వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు సన్నాహాలు చేస్తుండటంతో ఉద్యోగార్థులు ప్రిపరేషన్‌లో తలమునకలైపోతున్నారు. నగరంలోని ప్రముఖ గ్రంథాలయాలు వీరి చదువులకు వేదికలవుతున్నాయి.

లైబ్రరీస్ అన్నీ ఫుల్ ప్యాక్..
టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్లపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది నిరుద్యోగులు వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్నారు. స్టడీ మెటీరియల్ లభ్యత, ఇతర సౌకర్యాల రీత్యా చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌తో పాటు ఇతర ప్రధాన లైబ్రరీలలో చదువుకోవడానికో ప్లేస్ వెతుక్కుంటున్నారు.

నగరంలో తాముండే చోట అసౌకర్యాలు, ఇరుకిరుకు గదుల్లో ప్రిపరేషన్ సరిగా సాగదని భావిస్తున్న ఉద్యోగార్థులు ప్రధానంగా చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి పెద్దసంఖ్యలో క్యూ కడుతున్నారు. ‘నేనుండే గదిలో నాతో పాటు మరో ముగ్గురు ఉంటారు. చదువుకోవాలంటే గురి కుదరదు. పైగా స్టడీ మెటీరియల్ కొరత.. అదే కేంద్ర గ్రంథాలయంలోనైతే ఈ సమస్య ఉండదు. వాతావరణమూ ప్రశాంతంగా ఉంటుంది. సందేహాలు వస్తే డిస్కషన్స్ ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు’ అని వివరించారు వరంగల్ జిల్లాకు చెందిన వెంకట్. ఈ యువకుడు ప్రస్తుతం ఎస్‌ఐ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు.

మోటివేషన్ అండ్ కెరీర్ గెడైన్స్
నగర కేంద్ర గ్రంథాలయానికి నిత్యం చదువుకోవడానికి వచ్చే నిరుద్యోగుల సంఖ్య వెయ్యికి మించుతోంది. ఈ లైబ్రరీ చుట్టుపక్కల పెద్దసంఖ్యలో కోచింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులు క్లాసులు ముగియగానే గ్రంథాలయానికి చేరుకుంటున్నారు. ఇక్కడ తగినంత స్థలం ఉండటంతో పాటు భారీ చెట్ల నీడన చదువుకోవడానికి అనువుగా ఉంది.

ఇక, ఉద్యోగార్థులను మధ్యలో ప్రోత్సహించడానికి, వారిలో ప్రేరణ కలిగించడానికి గ్రంథాలయం ఆడిటోరియంలో మధ్య మధ్యలో మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. నిపుణులు కెరీర్ గెడైన్స్ ఇస్తున్నారు. అభ్యర్థుల్లో ఇవి ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి.  ‘ఉద్యోగాలపై ఆశతో ఇక్కడకు వస్తున్న మాలాంటి నిరుద్యోగులకు ఇవెంతో ఉపకరిస్తున్నాయని’ సిటీకి చెందిన నవీన్ తెలిపాడు.
 
కుర్చీ..చదువు.. అక్కడే భోజనం
ఉదయాన్నే వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్ననిరుద్యోగులు, అది పూర్తి కాగానే నేరుగా సెంట్రల్ లైబ్రరీకి
వచ్చేస్తున్నారు. కొందరు తమతో పాటే ఒక కుర్చీ తెచ్చుకుంటారు. అది అందుబాటులో లేనివారు సమీపంలో అద్దెకు కుర్చీలు ఇస్తున్న వివిధ దుకాణదారుల నుంచి సమకూర్చుకుంటున్నారు. ఇవి రోజుకు తక్కువ రేటుకే అద్దెకు లభిస్తున్నాయి.

సొంతంగా తెచ్చుకుంటున్న వారు ఆ రోజు చదువు పూర్తి కాగానే కుర్చీని లైబ్రరీ ప్రాంగణంలోని కిటికీ ఊచలకు, చెట్లకు గొలుసు వేసి, చిన్న చీటీపై పేరు రాసి కట్టేస్తారు. చదువు మధ్యలో భోజనానికి వెళ్లాలంటే.. ఎంతోకొంత టైమ్ వేస్ట్ తప్పదు. ఉద్యోగార్థుల ఇబ్బందిని, వారి రద్దీని గుర్తించిన జీహెచ్‌ఎంసీ, హరేకృష్ణ మూవ్‌మెంట్.. రూ.5కే భోజన పథకాన్ని ఇక్కడా అమలు చేస్తున్నాయి. ఇది తక్కువ ఖర్చుతోనే కడుపు నింపడంతో పాటు వాళ్ల చదువుకునే సమయాన్నీ ఆదా చేస్తోంది. ‘జాబ్‌పై ఆశ ఉంది. కానీ జేబు నిండా డబ్బుల్లేవ్..మాలాంటి వాళ్లకు ఇది వరం. రోజూ ఇక్కడ దాదాపు 600 మందికి పైగా రూ.5 భోజనంతోనే కడుపు నింపుకొంటున్నారు’ అని చెప్పాడు ఆదిలాబాద్ జిల్లా నుంచి గ్రూప్స్ శిక్షణకు వచ్చిన రమేష్.
 
లేడీస్‌కు ప్రత్యేక రీడింగ్ రూమ్
అమ్మాయిలు చదువుకోవడానికి వీలుగా సెంట్రల్ లైబ్రరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకల్యంతో బాధపడే వారి కోసం గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే తగిన సౌకర్యాలు కల్పించారు. అలాగే, రూ.5 ఖర్చుతోనే ఇక్కడ కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను సమకూరుస్తున్నారు. ఇక, చదువులమ్మ చెట్టు నీడగా మారిన చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో గ్రూప్-1, 2, ఎస్.ఐ. బ్యాంక్ తదితర పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ విస్తృతంగా అందుబాటులో ఉండటం కూడా నిరుద్యోగులు ఇక్కడకు చేరుకోవడానికి కారణమవుతోంది.
 
 గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా..
నేను ఎంబీఏ (ఫైనాన్స్) చేశాను. గ్రూప్-1, 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నోటిఫికేషన్ వచ్చే నాటికి పూర్తి సంసిద్ధంగా ఉండాలని ఇప్పటి నుంచే ఇక్కడ ప్రిపరేషన్ ప్రారంభించాను. ఆర్డీఓ కావాలనేది నా ఆశయం.
 - ఎస్.పారిజాత
 
ఇక్కడైతే అన్నీ..
మేం ఉండే రూమ్ చాలా ఇరుకు. ఐదుగురుం ఉంటున్నాం. పుస్తకం తీస్తే ఏదో ఒక డిస్ట్రబెన్స్. ఏదైనా సందేహం వచ్చినా, స్టడీ మెటీరియల్ కావాల్సి వచ్చినా ఇక్కడ అందుబాటులో ఉండవు. అదే లైబ్రరీ వద్దనైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి. నేను ఎస్‌ఐ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను.
 - అంజిగౌడ్, ఖమ్మం
 
ఎంతో బాగుంది..
ఇంజనీరింగ్ చదివినా.. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో గ్రూప్ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. జీహెచ్‌ఎంసీ, హరేకృష్ణ మూవ్‌మెంట్ రూ.5కే అందిస్తున్న భోజనం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి రూముల్లో ఉంటున్న వారికి, హాస్టల్స్‌లో ఉంటున్న వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. చదువు మధ్యలో బయటకు వెళ్లకుండా గ్రంథాలయంలోనే భోజన సౌకర్యం లభిస్తుండటంతో సమయం కలిసి వస్తోంది.
 - సులోచన, కరీంనగర్
 
ఎవరికీ భారం కాకుండా..
మాది సైదాబాద్. నాకు కవల పిల్లలు. వచ్చే నోటిఫికేషన్లకు ఇప్పటి నుంచే సిద్ధం కావడం కోసం.. పిల్లల్ని అత్తయ్య వాళ్ల వద్ద ఉంచి, నేను చిక్కడపల్లిలోని ఫ్రెండ్ రూమ్‌కి మారాను. నిత్యం సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ప్రిపరేషన్ సాగిస్తున్నాను. పగలంతా ఇక్కడే ఉండి చదువుకోవడం, రూ.5కే ఇక్కడ భోజనం లభిస్తుండటం వంటి వాటి వల్ల నా ఫ్రెండ్‌కు నేను భారం కాకుండా ఉండగలుగుతున్నాను.        - శ్రీలత
 
కావలెను..
లైబ్రరీలో ఉద్యోగార్థులకు సంబంధించిన ప్రకటనలు భలే ఆకర్షిస్తున్నాయి. ‘లైబ్రరీకి దగ్గరలో రూమ్స్ ఖాళీ ఉంటే దయచేసి చెప్పండి’ అని ఒకరు.. ‘అర్థమెటిక్స్ శిక్షణ కోసం ఓ కోచింగ్ సెంటర్‌లో చేరాను. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల మధ్యలో మానేస్తున్నాను. కాబట్టి నా అడ్మిషన్‌ను తక్కువ ధరకే ఆఫర్ చేస్తున్నా..’ అని ఇంకొకరు.. ‘రూమ్మేట్స్ కావాలి’ అని కొందరు తెల్ల కాగితాలపై ఫోన్ నంబర్లతో సహా రాసి అతికిస్తున్న ప్రకటనలు పలువురికి ఉపయోగపడుతున్నాయి. ఇక, పుస్తకాలు, బస్‌పాస్‌లు పోగొట్టుకున్న వారు సైతం ఆ విషయం తెలుపుతూ వాటిని తిరిగి అందించాలంటూ ఇలాగే ప్రకటనల ద్వారా అభ్యర్థిస్తున్నారు.

మరిన్ని వార్తలు