దావత్‌ తర్వాత ధనాధన్‌!

1 Jun, 2016 02:38 IST|Sakshi
దావత్‌ తర్వాత ధనాధన్‌!

పిస్టల్‌తో అర్ధరాత్రి గాల్లోకి కాల్చిన రియల్టర్‌
హైదరాబాద్‌ నార్సింగి ఠాణా పరిధిలో జరిగిన ఉదంతం

హైదరాబాద్‌: రాజధానిలో మరోసారి తుపాకీ పేలింది. రిసార్ట్స్‌లో జరిగిన దావత్‌లో పాల్గొన్న రియల్టర్‌ అది ముగిసిన తర్వాత తన లైసెన్డ్ పిస్టల్‌కు పని చెప్పాడు. మద్యం మత్తులో అకారణంగా కాల్చడంతో రెండు రౌండ్లు గాల్లోకి దూసుకుపోయాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉదంతంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. నిందితుడిని అరెస్టు చేసిన నార్సింగి పోలీసులు పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు.
గండిపేట్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ విజేత భర్త ప్రశాంత్‌యాదవ్‌ సోమవారం రాత్రి గోల్కొండ రిసార్ట్స్‌లో స్నేహితులకు విందు ఏర్పాటు చేశారు.

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులైన నార్సింగి మాజీ సర్పంచ్‌ వెంకటేష్‌యాదవ్, పుప్పాలగూడకు చెందిన ప్రభాకర్, మణికొండకు చెందిన బి.అజయ్, బి.శ్రీనివాస్, ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని ఆహ్వానించారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన ప్రభాకర్‌ కొన్ని రోజుల క్రితం పుప్పాలగూడ ప్రాంతానికి వచ్చి నివసిస్తున్నారు. ఈయన వద్ద కోదాడ పోలీస్‌ స్టేషన్ నుంచి 2014లో తీసుకున్న లైసెన్స్‌తో ఖరీదు చేసిన 32 క్యాలిబర్‌ పిస్టల్‌ ఉంది. వీరంతా కలిసి రాత్రి 11.30 వరకు రిసార్ట్స్‌లోనే గడిపారు. ఆపై రెండు కార్లలో ఇళ్లకు బయలుదేరారు. ప్రశాంత్‌యాదవ్‌ ఇంటి వద్దకు రాగానే అందరూ దిగి కొద్దిసేపు ఓ విషయమై చర్చించుకున్నారు. మిగిలిన వారు వెళ్లిపోగా... ప్రభాకర్‌తో పాటు మరో స్నేహితుడు అక్కడ మిగిలారు.

ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌ తన పిస్టల్‌ తీసి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో అంతా అక్కడ నుంచి జారుకోగా... కాల్పుల మోతతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విందులో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. మంగళవారం ప్రభాకర్‌ వద్ద నుంచి పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆయుధ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కళ్ల ముందే ఓ సహచరుడు కాల్పులు జరిపినా... ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేయని మరొకరిపైనా కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు