రోడ్డుపై రియల్టర్ల రచ్చ

3 Oct, 2016 08:45 IST|Sakshi
రోడ్డుపై రియల్టర్ల రచ్చ

- భూ వివాదంలో ముగ్గురి మధ్య వాగ్వాదం
- జేబులో పిస్టల్ లాక్కొనేందుకు ప్రయత్నం

 
హైదరాబాద్: ఓ భూ సెటిల్‌మెంట్ వ్యవహారంలో ముగ్గురు రియల్టర్లు ఘర్షణకు దిగారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో మొదలైన ఈ రచ్చ చివరకు రోడ్డుపైకి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజీలో  చూసిన పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. షేక్‌పేట గ్రామ పరిధిలోని వెస్టర్న్ ప్లాజాకు ఎదురుగా 3 వేల గజాలను క్వారీ వ్యాపారస్తుడు వెన్నెపల్లి దీపక్‌రావు, పాతబస్తీలో ఓ పార్టీకి చెందిన కేఎస్ ఆనందరావు, శ్రీనివాస్‌రెడ్డి కలసి రూ. 1.30 కోట్లతో భూమిని కొనుగోలు చేశారు.

వివాదాల్లో ఉన్న ఈ భూమిని ముగ్గురూ పంచుకోవాలని నిర్ణయించారు. భూ విషయమై మాట్లాడేందుకు దీపక్‌రావు, అతని స్నేహితుడు మూర్తి, ఆనందరావు ఆదివారం హిమాయత్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఆనందరావు.. తన వద్దనున్న డాక్యుమెంట్లపై సంతకం పెట్టాలని దీపక్‌రావును ఒత్తిడి చేశాడు.
 
 తన అడ్వొకేటు సలహా లేకుండా సంతకం చేయనని దీపక్‌రావు చెప్పాడు. దీంతో ఘర్షణ మొదలైంది. ఒకరినొకరు తోసుకొంటూ రోడ్డెక్కారు. వాగ్వాదం పెరిగిన క్రమంలో దీపక్‌రావు జేబులో ఉన్న లెసైన్స్‌డ్ పిస్టల్ లాక్కొనేందుకు ఆనందరావు ప్రయత్ని ంచాడు. ఈ ఘర్షణను సీసీ టీవీల్లో చూసిన పోలీసులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న బ్లూకోట్స్ రియల్టర్లను నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు