తప్పుకోండి ప్లీజ్!

19 Jan, 2016 04:52 IST|Sakshi
తప్పుకోండి ప్లీజ్!

రెబల్స్ విత్ డ్రా కోసం పాట్లు
అన్ని పార్టీల్లో బుజ్జగింపుల కమిటీలు
మాట వినేందుకు స్పెషల్ ఆఫర్లు
నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ

 
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడి... తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు స్పెషల్ ప్యాకేజీలు సిద్ధం చేశాయి. మంగళవారం నుంచినామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మొదలవుతుండటంతో రాజకీయ పార్టీల          ‘బుజ్జగింపు కమిటీ’ల ప్రతినిధులు స్పెషల్ ప్యాకేజీలతో రంగంలోకి దిగారు. తమ మాట విని... పార్టీ అధికారిక అభ్యర్థి విజయానికి కృషి చేస్తే తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన అనంతరం 150 డివిజన్లకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులమంటూ 655 మంది, కాంగ్రెస్ అభ్యర్థులుగా 519 మంది, బీజేపీ తరఫున 331 మంది, తెలుగుదేశం నుంచి 530 మంది మిగిలారు. వీరిలో గడువులోగా బీ ఫారం ఎవరు అందజేస్తే వారే అధికారిక అభ్యర్థి.

స్పెషల్ ఆఫర్లతో టీఆర్‌ఎస్ బృందం
తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నత స్థాయి బృందాలు స్పెషల్  ఆఫర్లతో రంగంలోకి దిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన బృందాలు ప్రతి డివిజన్‌నూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరుగుబాటుదారులతో చర్చలు ప్రారంభించాయి. టీఆర్‌ఎస్ తర ఫున మొత్తం 888 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో సరైనవి 655గా తేల్చారు. వీరిలో  అధికారిక అభ్యర్థులు కాకుండా 128 మంది బలమైన వ్యక్తులు పోటీలో ఉన్నారు. వీరికి నామినేటెడ్ లేదా ఇతర పదవులిస్తామన్న హామీలతో పాటు తగిన గుర్తింపునిస్తామని ప్రతిపాదనలు చేస్తున్నారు.
 
‘దేశం’-బీజేపీలలో ఎవరికి వారే
 తెలుగుదేశం-బీజేపీలు 87-63 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అధికారికంగా చాలా చోట్ల అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించటంతో భారీ ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీలో 688 మంది నామినేషన్లు వేయగా... అందులో 530, బీజేపీలో 456 వేయగా... 331 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తేల్చారు. చాలా చోట్ల ఇరుపక్షాల్లో భారీగా తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నా.. ఈ రెండు పార్టీల తరఫున వారిని శాంతింపజేసే దిశగా కార్యాచరణ ప్రారంభం కాలేదు. మల్కాజిగిరి తదితర నియోజక వర్గాల్లో అయితే తాము చంద్రబాబు చెబితే తప్ప దిగిరాబోమని ఆ పార్టీ నేతలు భీష్మించుకు కూర్చుంటున్నారు.
 
కాంగ్రెస్‌లో ఇన్‌చార్జులకే బాధ్యత
 కాంగ్రెస్ పార్టీ తరఫున 698 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 519 సక్రమమైనవని అధికారులు తేల్చారు. 150 డివిజన్లకు భారీగా పోటీ ఉండడంతో తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే బాధ్యతను నియోజకవర్గ ఇన్‌చార్జులకే పీసీసీ అప్పగించింది. మెజారిటీ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల సూచనల మేరకే టికెట్లు కేటాయించిన దృష్ట్యా మిగిలిన భారాన్ని కూడా వారిపైనే ఉంచుతున్నట్లు పీసీసీ తేల్చేసింది.
 
మత పెద్దలకు..ఎంఐఎం బాధ్యత

 ఎంఐఎం అభ్యర్థులుగా 89 స్థానాల్లో నామినేషన్లు వేయగా... అందులో 66 చోట్ల నామినేషన్లు సక్రమమేనని తేల్చారు. కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో మిగిలినవారిని ఉపసంహరింపజేసే బాధ్యతను మత పెద్దలకు పార్టీ అప్పగించింది.
 

మరిన్ని వార్తలు