సైబరాబాద్‌లో ‘రికవరి’రికార్డు

31 Dec, 2014 01:57 IST|Sakshi
సైబరాబాద్‌లో ‘రికవరి’రికార్డు

⇒  స్వాధీనం చేసుకున్న సొత్తు 74 శాతం
⇒  ఛేదించిన కేసులు 68 శాతం
⇒  కొత్త సంస్కరణలతో ఉత్తమ ఫలితాలు: సీవీ ఆనంద్

 సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో చోరీ సొత్తు రికవరీ చేశారు. వరుసగా ఇలా నాలుగేళ్లు రికార్డు సొంతం చేసుకున్న ఘనత వీరికే దక్కింది. నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం పరిష్కారం చేసిన ఘనత కూడా వీరికే ఉంది. ఈ ఏడాది 74 శాతం రికవరీ సొత్తు స్వాధీనం చేసుకోగా, 68 శాతం కేసులను పరిష్కరించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం గచ్చిబౌలిలోని కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఇందులో సైబరాబాద్ కమిషనరేట్‌లో నేరాలు-ఘోరాలు, సాధించిన విజయాలపై 2014 వార్షిక నివేదికను విడుదల చేశారు. కమిషనరేట్‌లో ఈ ఏడాది 24,922  కేసులు నమోదవగా, వాటిలో సొత్తు కోసం చేసిన చోరీలు 5343 ఉన్నాయన్నారు. వీటిలో 3620 కేసులు చేధించామన్నారు. చోరీ సొత్తులో రూ.22.76 కోట్లు (74 శాతం) రికవరీ చేసినట్టు ఆయన చెప్పారు. ఎస్‌ఓటీ, సీసీఎస్ పోలీసుల ప్రత్యేక కృషితో పాటు జోన్ల వారీ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం, ఠాణాలలో క్రైమ్, శాంతి భద్రతలపై వేర్వేరు ఇన్‌స్పెక్టర్లను నియమించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.

ఇక శివ ఎన్‌కౌంటర్ తరువాత సైబరాబాద్‌లో గణననీయమైన స్థాయిలో చైన్ స్నాచింగులు తగ్గాయని ఆనంద్ తెలిపారు. మహిళా భద్రతకు తీసుకున్న చర్యలతో వారిపై దాడులు గతేడాదికంటే తగ్గాయన్నారు. కార్డన్ సెర్చ్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. స్నేక్ గ్యాంగ్ నిందితులకు శిక్షలు పడే విధంగా చార్జీషీట్ వేశామని వివరించారు. రాత్రి పోలీసు పెట్రోలింగ్, ఓఆర్‌ఆర్, హైవేలపై కూడా పెట్రోలింగ్‌లో మార్పులు చేపట్టామన్నారు.

ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మృతులు, క్షతగ్రాతుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు రవివర్మ, ఏఆర్ శ్రీనివాస్, కార్తికేయ, రమా రాజేశ్వరి, రమేష్ నాయుడు, రంగారెడ్డి, అవినాష్ మహంతి, అదనపు డీసీపీలు మద్దిలేటి శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, వాసుసేన తదితరులు పాల్గొన్నారు.
 
ఎస్‌ఓటీ సాధించిన ఘనత
ఎస్‌ఓటీలు 2013లో 188 కేసులు చేధించి రూ.5,82,91,255 సొత్తును స్వాధీనం చేసుకోగా ఈ ఏడాది 1084 కేసులను చేధించి రూ.12,30,31,349 సొత్తు స్వాధీనం చేసుకుని రికార్డు సృష్టించింది. ఎస్‌ఓటీ అదనపు డీసీపీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్లు పుష్పన్ కుమార్, ఉమేందర్, వెంకట్‌రెడ్డి, గురురాఘవేంద్ర, ఎస్‌ఐలు ఆంజనేయులు, రాములు, శివలు ఈస్ట్, వెస్ట్ బృందాలుగా ఏర్పడి 179 పేకాట శిబిరాలు, 160 వ్యభిచార కేంద్రాలు, 11 డ్రగ్స్ మాఫియా గ్యాంగ్‌లు, తొమ్మిది సట్టా కేంద్రాలపై దాడులు చేశారు.
 
ఈ ఏడాది పురోగతి
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీటీపీ, ఎస్‌ఓటీ, సీఐ సెల్ విభాగాలను ఈస్ట్, వెస్ట్ జోన్‌లుగా రీ ఆర్గనైజేషన్ చేశారు.
జోన్ పరిధిలో కొత్తగా జోనల్ టాస్క్‌ఫోర్స్ టీములను ఏర్పాటు చేశారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్‌పై సిబ్బంది, రాత్రి గస్తీ, సీసీఎస్, అడ్మిన్ ఎస్‌ఐ లాంటి అంశాల్లో పురోగతి సాధించారు.
భూ వివాదాలపై ఎస్‌ఓపీ, కార్డన్ సెర్చ్, నాకాబందీ, డ్రకంన్ డ్రైవ్‌లు చేపట్టారు.
ఐటీ కారిడార్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు.
ప్రాపర్టీ నేరాల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 68 శాతం నేరాలను చేధించారు.
 
2014లో పెద్ద ఘటనలు
సిక్ చావుని అల్లర్లలో పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి.
కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ ఎన్‌కౌంటర్.
నకిలీ నోట్ల ముఠాను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు చేపట్టిన డెకాయి ఆపరేషన్‌లో నిందితుల దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్‌రావు మృతి. పోలీసు కాల్పుల్లో ముస్తఫా అనే నిందితుడు మృతి.
 
భవిష్యత్తు ప్రణాళిక ఇదీ..
ఇంటిగ్రేటెడ్ ఈ-చలాన్ విధానం
సిటిజన్ కనెక్ట్ యాప్ రూపకల్పన
సోషల్ మీడియా పోలీసింగ్
కోర్టు మానిటరింగ్ విధానం అమలు
సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మెసర్స్

మరిన్ని వార్తలు