‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు నిలిపివేత

6 Jun, 2015 02:27 IST|Sakshi
‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు నిలిపివేత

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతోపాటు బాధితులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే ఈనెల 9న స్వయంగా తమ ముందు హాజరుకావాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీలను ఆదేశిస్తూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వులను సైతం నిలిపేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉత్తర్వులను వచ్చేనెల 3వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు