-

వేతనాల వ్యయం తగ్గించుకోండి

29 Aug, 2017 03:14 IST|Sakshi
వేతనాల వ్యయం తగ్గించుకోండి
- డిస్కంలకు ఈఆర్సీ ఆదేశం
విద్యుత్‌ సిబ్బంది పీఆర్సీని సవరించండి
మూడు నెలల్లో కార్యాచరణ నివేదిక ఇవ్వండి
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీ విధానాన్ని సవరించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల డిస్కంలను ప్రమాణంగా తీసు కుని రాష్ట్ర డిస్కంల ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే సీనియర్‌ ఇంజనీర్ల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీతం కన్నా అధికంగా ఉందని, అయినా విద్యుత్‌ అధికారులు వినియోగ దారులకు సరైన సేవ లందించడం లేదని ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణల్లో రైతు, వినియోగదారుల సంఘాలు ఇటీవల ఆరోపణలు చేశాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే విద్యుత్‌ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వ పీఆర్సీ విధానానికి అనుగుణంగా విద్యుత్‌ ఉద్యోగుల పీఆర్సీని సవరించాలని, ఇతర రాష్ట్రాల డిస్కంల తరహాలో ఉద్యోగుల వేతనాల వ్యయం తగ్గించుకోవాలని ఈఆర్సీ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే భవిష్యత్తులో డిస్కంలు ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ల బకాయిలను నిపుణులతో గణించాలని సూచించింది.
 
లోపాలపై మూడు నెలల్లో నివేదిక
కిందకు వేలాడే విద్యుత్‌ తీగలు, రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లతో ప్రమాదాలు జరుగుతున్నా యని చాలామంది వినియోగదారులు తెలిపా రని ఈఆర్సీ పేర్కొంది. ఈ లోపాలు సరిదిద్దేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో కార్యాచరణ నివేదిక సమర్పించాలని డిస్కం లను ఆదేశించింది. కార్యాచరణపై ప్రతి 6 నెలలకోసారి పురోగతి నివేదిక సమర్పిం చాలని కోరింది. 2016–17లో రాష్ట్రంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి నివేదిక సమర్పించాలని తెలిపింది. 
 
డిస్కంలకు ఈఆర్సీ జారీ చేసిన ముఖ్య ఆదేశాలివీ..
► విద్యుత్‌ ప్రమాదాల బాధితులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవా లి. పరిహారం దరఖాస్తుదారులకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించాలి. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా దరఖాస్తుదా రులు పురోగతిని తెలుసుకునేలా సమాచా రాన్ని డిస్కంల వెబ్‌సైట్లో పొందుపర్చాలి
► క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సిబ్బంది కొరతపై తగిన చర్యలు తీసుకోవాలి
► పోటీ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా డిస్కంలు స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్లు జరపాలి
► ఐటీ కంపెనీల సముదాయాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలకు ప్రత్యేక విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయాలి. నవంబర్‌ 30లోగా దీనిపై నివేదికను సమర్పించాలి. 
మరిన్ని వార్తలు