నయాసాల్‌పై నజర్

20 Dec, 2013 06:06 IST|Sakshi

=ముస్తాబవుతున్న హోటళ్లు, పబ్స్, ఫాంహౌస్,రిసార్టులు
 =డ్రగ్స్,విదేశీ మద్యం, రేవ్ పార్టీలపై డేగకన్ను
 =అప్రమత్తమవుతున్న పోలీసులు

 
 సాక్షి,సిటీబ్యూరో: నయాసాల్‌ను అంగరంగా ఆహ్వానించేలా యువతను ఉర్రూతలూపేందుకు పబ్‌లు, హోటల్స్, రిసార్ట్సు, ఫాంహౌస్‌లు, హుక్కాసెంటర్లు ఒకపక్క ముస్తాబవుతుండగా.. వేడుకల ముసుగులో జరిగే అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్‌ఓటీ) పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నారు. వేడుకల సందర్భంగా కొంతమంది నిర్వాహకులు యువతను ఆకర్షించేందుకు మద్యం, డ్రగ్స్, రేవ్ పార్టీ (అశ్లీలనృత్యాలు)లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీ సులు ఇలాంటి నిర్వాహకులపై డేగకన్ను ఉంచారు. ఇప్ప టికే న్యూఇయర్ వేడుకలకు సరఫరా చేసేందుకు తరలిస్తున్న డ్రగ్స్ ముఠాల భరతాన్ని కమిషనర్ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ ఓఎస్డీ గోవర్ధన్‌రెడ్డి పట్టారు. ఇదే అప్రమత్తతతో న్యూఇయర్ వరకు ఉంటామని పోలీ సులు చెబుతున్నారు. ఇక నకిలీ మద్యంతోపాటు విదేశీ మద్యం కూడా ఏరులై పారే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఇలాంటి పాత నేరస్తులపై నిఘా ఉంచారు. న్యూఇయర్ వేడుకలు నిర్వహించే సంస్థలు, వ్యాపార నిర్వాహకులకు ఇప్పటికే తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
 
మోగిస్తే..సీజే : ఇక ఇంజనీరింగ్ కళాశాలలో డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలపై ఆయా ఠాణాల ఇన్‌స్పెక్టర్లు దృష్టిసారించారు. పద్ధతి ప్రకారం ఉత్సవాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని..నిబంధనలను ఉల్లంఘిస్తేనే చర్యలు తప్పవని సూచిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డీజేను ఎవరైనా ఉపయోగిస్తే సీజ్ చేయడమే కాకుండా నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఇక ఆయా జిల్లాల నుంచే కాకుండా ఇతరరాష్ట్రాలకు చెందిన యువతులను నగరానికి తరలిస్తారు. వీరిచే ఫాంహౌజ్‌లు, గెస్ట్‌హౌజ్‌లలో రేవ్ పార్టీలు నిర్వహించే ప్రమాదం ఉంది. ఇటువైపు కూడా ఎస్‌ఓటీ పోలీసులు కన్నేసి ఉంచారు. ప్రధానంగా శివారుప్రాంతాల్లో ఉన్న ఫాంహౌస్‌ల కదలికలపై దృష్టిసారించారు. ఇటు సైబరాబాద్ పోలీసులు, నగర పోలీసులు నిఘా పెంచడంతో నిర్వాహకులు రంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాల ఫాంహౌస్‌లను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
 
నిబంధనలు పాటించాల్సిదే: ఆనంద్, కమిషనర్

ఏ వేడుకల్లోనైనా నిర్వాహకులు పోలీసులు నిబంధనలు పాటించాల్సిందేనని కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎవరు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.  
 

మరిన్ని వార్తలు