-

సీఎం ఆదేశానికే దిక్కులేదు

23 Aug, 2016 03:21 IST|Sakshi

ప్రైవేటు బస్సుల నియంత్రణలో ఆర్టీసీ-ఆర్టీఏల మధ్య సమన్వయ లోపం
 
 సాక్షి, హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతూ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న ప్రైవేటు బస్సుల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి వందలకొద్దీ కేసులు నమోదు చేయటం, ఆ తర్వాత చల్లబడటం సాధారణమైపోయింది. ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా నిలవరించేలా రవాణా శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేయటంలేదు. ఫలితంగా వరుస ప్రమాదాలతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు దాదాపు 500 వరకు ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.

వీటికి కేవలం కాంట్రాక్టు క్యారేజీ పర్మిట్ మాత్రమే ఉన్నా, మూడొంతులకు పైగా బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్నాయి. ఏ ట్రావెల్స్ వద్ద ఎన్ని బస్సులు స్టేజీ క్యారియర్లుగా తిరుగుతున్నాయో రవాణాశాఖ అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉంది. కానీ వాటిని నియంత్రించే విషయంలో ప్రభుత్వం నుంచి కచ్చితమైన ఆదేశాలు రాకపోవటంతో అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఎక్కడైనా బస్సును సీజ్ చేస్తే నిర్వాహకులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి నుంచి అధికారులపై ఒత్తిడి చేసి విడిపించుకుంటున్నారు. ఇటీవల విజయవాడ నుంచి మెడికోలతో నగరానికి వస్తున్న ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురికావటంతో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హడావుడి తనిఖీలతో ఠారెత్తించిన అధికారులు ఆ ఒక్క బస్సు పర్మిట్ రద్దు మినహా మరే చర్యలు తీసుకోలేకపోయారు. సోమవారం ఖమ్మం జిల్లాలో వంతెనపై నుంచి కాలువలో బస్సు పడ్డ దుర్ఘటనతో మళ్లీ హడావుడి ప్రారంభించారు.

 సీఎం హామీ... చర్యలేవీ?: జూన్‌లో సీఎం కేసీఆర్ ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సమయంలో ప్రైవేటు బస్సుల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టేలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను నియంత్రించేందుకు ఆర్టీసీ-రవాణా శాఖల మధ్య సమన్వయం కోసం రవాణా శాఖ జేటీసీని సమన్వయకర్తగా నియమించారు. కానీ ఇప్పటి వరకు ఆ సమన్వయం కోసం ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఒక్క బస్సుపై కూడా చర్యలు తీసుకోలేదు.

మరిన్ని వార్తలు