సంస్కరణల తర్వాతే సాగు నీటి సంఘాలకు ఎన్నికలు!

3 Oct, 2014 00:14 IST|Sakshi

చట్టంలో వూర్పు దిశగా సర్కారు ఆలోచనలు

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి వినియోగ సంఘాలకు ఎన్నికలు జరిపే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల కారణంగా పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన నీటి సంఘాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి సంస్కరణలు తేవాలని భావిస్తోంది. నీటి వినియోగ సంఘాలను అసలైన రైతు సంఘాలుగా మార్చేందుకు చట్టంలో కీలక మార్పులు చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. సాగు నీటి సంఘాల ఎన్నికల విషయుంలో ఇటీవల ఫలు దఫాలుగా అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రుల స్థాయిలో కీలక చర్చలు జరిగాయి. జైకా, వరల్డ్‌బ్యాంక్ నిధుల కేటాయింపుల్లో ఆ సంస్థల ప్రతినిధులు రైతుల భాగస్వామ్యాన్ని కోరుతున్నారని, ఈ దృష్ట్యా నీటి సంఘాల ఎన్నికలు అనివార్యమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇదే సమయంలో నీటి సంఘాల ముసుగులో అధ్యక్షులుగా ఎన్నికైన నేతలు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారని, నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే నిధులను దుర్వినియోగం చేసిన ఉదంతాలను ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు వివరించారు.

ముఖ్యంగా ఎస్సారెస్పీ పరిధిలో గతంలో సాగునీటి సంఘాలు చేసిన అక్రమాలకు 20 మంది ఇంజనీర్లు బలయ్యారని, ఇప్పటికీ వారంతా ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ దృష్ట్యా నిజమైన రైతు వ్యవస్థతో సంఘాల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించి, ఆయకట్టు అభివృద్ధి, సమర్థంగా నీటి సరఫరా, కాల్వల నిర్వహణ ఉండేలా అసలైన రైతు సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే రైతు యాజమాన్య చట్టానికి కీలక మార్పులు చేసే దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉండవచ్చని, ఆ తర్వాతే ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళతారని అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు