‘రిజిస్ట్రేషన్’కు కార్పొరేట్ కళ

8 Jul, 2016 02:33 IST|Sakshi

వినియోగదారులకు మెరుగైన వసతుల కల్పనకు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ అతి త్వరలోనే కార్పొరేట్ కళను సంతరించుకోబోతున్నాయి. ఇప్పటివరకు అరకొర వసతులతో అధ్వాన స్థితిలో కనిపించే ఆయా కార్యాలయాల్లో.. ఇకపై వినియోగదారులకు మెరుగైన వసతులు కల్పించాలని రిజిష్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఏడాదికి సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని అందించే  రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కార్పొరేట్ స్థాయి వసతుల కల్పనకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

వివిధ రకాల రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే వినియోగదారులకు పరిశుభ్రమైన మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం, కూర్చునేందుకు మంచి ఫర్నిచర్, డాక్యుమెంట్లను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన స్టేపుల్స్, పిన్నులు, ఫొటోలను అతికించేందుకు గమ్ స్టిక్స్, కార్యాలయానికి సమర్పించాల్సిన జిరాక్స్ ప్రతులను తీసుకునేందుకు ఫొటోస్టాట్ మెషీన్.. తదితర వసతులను సమకూర్చాలని అధికారులు భావిస్తున్నారు. దీనికోసం అయ్యే ఖర్చును వినియోగదారులు చెల్లిస్తున్న యూజర్ చార్జీల నుంచే భరించాలని సర్కారుకు విన్నవించారు.
 
 రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీలతో పాటు ప్రతియేటా యూజర్ చార్జీల కింద వినియోగదారులు రూ.18 కోట్లను చెల్లిస్తున్నారు. అయితే, ఆ సొమ్మంతా రిజిస్ట్రేషన్ల శాఖకు రాకుండా ట్రెజరీ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమవుతుండటంతో వసతుల కల్పనకు నిధుల కొరత ఏర్పడుతోంది. యూజర్ చార్జీలు వినియోగదారుల కోసమే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
 
 వేగవంతమైన నెట్‌వర్క్ ఏర్పాటు
 రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరుగుతోన్న జాప్యానికి చెక్ చెప్పేందుకు వేగవంతమైన నెట్‌వర్క్ సదుపాయాన్ని కల్పించాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఇందుకోసం మల్టీ ప్రొటోకాల్ కేబుల్ స్విచ్ నెట్‌వర్క్‌కు మారాలని నిర్ణయించారు. కొత్త నెట్‌వర్క్‌ను తీసుకుంటే ఏడాదికి రూ. 1.20 కోట్ల వ్యయం కానుందని, ప్రభుత్వం నుంచి అనుమతి కోసం లేఖ రాసినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు