అవినీతికి కాంట్రాక్టు!

6 May, 2016 01:31 IST|Sakshi
అవినీతికి కాంట్రాక్టు!

* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవినీతి గ్రహణం
* భారీగా సొమ్ము చేసుకుంటున్న ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ‘అవినీతి’ గ్రహణం పట్టింది. దొరికిందే తడవంటూ అందినకాడికి దండుకోవాలని చూస్తున్న ‘అధికార భూతం’... వేలాది మంది ఆశలను పట్టి మింగేస్తోంది. క్రమబద్ధీకరణ ఫైళ్లను ఎక్కడికక్కడ తొక్కిపెట్టి కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. కొర్రీలు పెట్టేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకే సరికొత్త భాష్యాలు చెబుతోంది. ఎంతో కొంత ‘సమర్పించు’కుంటే పనవుతుందంటూ బేరసారాలూ మొదలుపెట్టింది. దీంతో ఎప్పుడెప్పుడు తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా.. అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
 
పంపింది రెండు విభాగాలే
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాథమిక గణాంకాల ప్రకారం 47 విభాగాల పరిధిలోని 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణకు తగిన అర్హతలు కలిగి ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 24వ తేదీకల్లా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం అన్ని శాఖలకు గతంలోనే లేఖలు రాసింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమై ఏప్రిల్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు కూడా.

కానీ ఆ గడువు దాటి రెండు వారాలు కావస్తున్నా కేవలం రెండు విభాగాల నుంచే ప్రతిపాదనలు అందాయని... అందులోనూ పది మందికి మించి అర్హులైన వారు లేరని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మరి మిగతా విభాగాలన్నీ ఉలుకూ పలుకు లేనట్లుగా వ్యవహరించడానికి కారణం తెర వెనుక సాగుతున్న అవినీతి భాగోతమేననే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని విభాగాల్లో బడా అధికారులే అవినీతికి ద్వారాలు తెరిచారని, పలు చోట్ల సిబ్బంది ఏకంగా బేరసారాల కోసం కౌంటర్లు తెరిచారని చెబుతున్నారు.
 
వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మాయలు!
ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులున్న వైద్యారోగ్య శాఖ క్రమబద్ధీకరణ ప్రక్రియలో చిత్ర విచిత్రాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం జారీ చేసిన చెక్‌లిస్టుకు భిన్నంగా... ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కేవలం పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్‌ఏల క్రమబద్ధీకరణకు మాత్రమే ప్రతిపాదనలు పంపాలని జిల్లాలకు లేఖలు రాశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అయోమయంలో పడ్డారు.

ప్రజారోగ్య విభాగం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 280 మంది కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పనిచేస్తున్నారు. వారిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 148 మంది అర్హులున్నట్లు సమాచారం. కానీ వారి జాబితాలను పంపకపోవడం వెనుక మతలబేమిటనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 147 మంది కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల క్రమబద్ధీకరణ ప్రతిపాదనల తయారీ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరిని ప్రసన్నం చేసుకుంటే తమ ఫైలు వేగంగా కదులుతుందోనని కాంట్రాక్టు ఉద్యోగులు సెక్రటేరియట్‌లోని విభాగాల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ఆత్రుతను, ఆరాటాన్ని అదనుగా చేసుకొని.. కొందరు ఉద్యోగులు అందిన కాడికి వసూలు చేసుకుంటున్నారు.
 
చేద్దాం... చూద్దాం..!
కొన్ని శాఖల అధికారులు ఉద్దేశపూర్వకంగానే క్రమబద్ధీకరణ ఫైళ్లకు అవినీతి గ్రహణం పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘ఇంకా నిబంధనలు రాలేదు.. మీ విషయం ఇంకా తేలలేదు.. మీకిస్తే మిగతా వాళ్లు నష్టపోతారు కదా.. అందరినీ రెగ్యులరైజ్ చేద్దామని అనుకుంటున్నాం..’ అంటూ కొందరు ఉన్నతాధికారులు తమకు తోచిన సమాధానాలతో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారు. మరి కొందరు విభాగాధిపతులు ఫైలుపై ఏవో కొర్రీలు రాసి నిలిపేస్తున్నారు. ‘ఎంతో కొంత ముట్టజెపితే ఫైలు ముందుకు కదులుతుంది.. లేకుంటే చూద్దాం.. ఇంకొంత కాలం వేచి చూద్దాం..’ అంటూ అవినీతికి తలుపులు తెరుస్తున్నారు. ఇదే అదనుగా కిందిస్థాయి ఉద్యోగులు నేరుగానే బేరసారాలు మొదలుపెట్టేస్తున్నారు.
 
నిబంధనలకు కొత్త అర్థం

ఇంటర్ విద్య విభాగంలో అత్యధికంగా 5,757 మంది, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో 2,473 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో జూనియర్ లెక్చరర్లు, పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో క్రమబద్ధీకరణ కోసం ఎవరి జాబితాలు పంపాలి, ఎవరివి అవసరం లేదనే షరతులేమీ ప్రభుత్వం విధించలేదు. ఆయా శాఖల పరిధిలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి ప్రతిపాదనలు విడివిడిగా పంపాలని మాత్రమే ఆదేశించింది. ఈ మేరకు అర్హులందరి ప్రతిపాదనలు పంపాల్సిన శాఖాధిపతులు, కార్యదర్శులు మాత్రం చెక్‌లిస్టుల తయారీలో చక్రం తిప్పుతున్నారు. అందుకే ఫైళ్లు ఆయా శాఖలు దాటి ముందుకు కదలటం లేదు.

మరిన్ని వార్తలు