విద్యుత్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

30 Jul, 2017 03:21 IST|Sakshi
విద్యుత్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

20,903 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల విలీనం 
సీఎం ఆమోదంతో వెంటనే వెలువడ్డ ఉత్తర్వులు  

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 20,903 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు శనివారం ఉత్తర్వులు జారీ చేశాయి.

ఉద్యోగుల విద్యార్హతలను ప్రామాణికంగా తీసుకుని ఉన్నత నైపుణ్యంగల వారికి ఆర్టిజన్‌ గ్రేడ్‌–1, నైపుణ్యంగల వారికి ఆర్టిజన్‌ గ్రేడ్‌–2, స్వల్ప నైపుణ్యంగల వారికి ఆర్టిజన్‌ గ్రేడ్‌–3, నైపుణ్యంలేని వారికి ఆర్టిజన్‌ గ్రేడ్‌–4 హోదాలు కల్పిస్తూ విలీనం (అబ్జార్షన్‌) చేసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. ట్రాన్స్‌కోలో 4,197 మంది, జెన్‌కోలో 2,914 మంది, టీఎస్‌ఎస్పీడీసీ ఎల్‌లో 9,459 మంది, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో 4,333 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు క్రమబద్ధీకరణ పొందారు. వారికి కొత్త పే స్కేల్‌ను విద్యుత్‌ సంస్థలు ప్రకటించాయి. ఏళ్ల తరబడి విద్యుత్‌ సంస్థల్లో తక్కువ జీతం తీసుకుంటూ కష్టపడుతున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.

ఆగమేఘాల మీద ప్రక్రియ...
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు, సుప్రీంకోర్టు ఇటీవల వ్యతిరేకించడం... విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు లో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో న్యాయ పరమైన చిక్కులు ఎదురుకాక ముందే క్రమబద్ధీ కరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతోపాటు ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది.

జెన్‌కో, ట్రాన్స్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ల పాలక మండళ్లు శుక్రవారం విద్యుత్‌సౌధలో సమావేశమై ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించాయి. ఆ వెంటనే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాయి. ఈ ప్రతిపాదనలపై విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామమ కృష్ణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు శని వారం చర్చించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమ బద్ధీకరణ ప్రతిపాదనలను సీఎం ఆమోదానికి పంపగా, ఆయన వెంటనే ఆమోదముద్ర వేయ డంతో ఈ ప్రక్రియ వేగంగా జరిగిపోయింది.

సీఎంకు ట్రాన్స్‌కో సీఎండీ కృతజ్ఞతలు
విద్యుత్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీ కరిస్తామన్న మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యుత్‌ సంస్థల తరఫును జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ముఖ్య మంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటా రన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు మరింత అంకితభావంతో పనిచేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావుకు ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు