ఈఎస్‌ఐ వైద్యం.. కార్మికుడి దైన్యం..

18 Jan, 2018 02:10 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలకు సొంతఖర్చులే  

నెలలు దాటినా అందని రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు సేవలందించాల్సిన ఈఎస్‌ఐ  దారుణంగా మారుతోంది. ఇందులో 15.2 లక్షల మంది ఈఎస్‌ఐ ఖాతాదారులున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి గరిష్టంగా 50లక్షల మంది ఈఎస్‌ఐ పథకం కింద అర్హులవుతారు. ఈఎస్‌ఐ పథకం కింద లబ్దిదారులకు శాఖపరమైన ఆస్పత్రులు, సేవలు అందుబాటులో లేని పక్షంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొంది ఆమేరకు బిల్లును తిరిగి పొందే వెసులుబాటు ఉంది. చికిత్స పొందిన వారికి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు అనుగుణంగా ఈఎస్‌ఐ యంత్రాంగం బిల్లును ఆమోదించి లబ్దిదారులకు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి. ప్రస్తుతం రీయింబర్స్‌మెంట్‌ ప్రక్రియ కార్మికులకు గుదిబండగా మారింది. ఏళ్లు గడిచినా బిల్లులకు మోక్షం లేక ఖాతాదారులు అప్పులపాలు కావాల్సివస్తోంది.
బకాయిలు రూ.72 కోట్లు...

ఈఎస్‌ఐ విభాగంలో రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో క్లియరెన్స్‌లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల మంది కార్మికులకు సంబంధించి రూ.72 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాదిగా వీటి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఇవేగాకుండా 2015–16, 2016–17  సంవత్సరానికి గాను బకాయిలు సైతం పూర్తిస్థాయిలో విడుదల కాలేదు.

సేవలూ అంతంతే..: ఈఎస్‌ఐ ఖాతాదారులకు రీయింబర్స్‌మెంట్‌కు గాను ప్రత్యేక నిబంధనలున్నాయి. రీయిం బర్స్‌మెంట్‌  కింద అర్హత సాధించాలంటే ముందుగా సమీప ఈఎస్‌ఐ ఆస్పత్రి వైద్యుల అనుమతి తీసుకోవాలి. అక్కడ రిఫరెన్స్‌ పొందిన తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలి. అత్యవసర, హృద్రోగాలు మినహాయించి మిగతా కేటగిరీకి చెందిన వారికి ఈ నిబంధన తప్పనిసరి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో ఎక్కువ మంది రిఫరెన్స్‌ తీసుకోవడం లేదు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో  వైద్యులు ఉండకపోవడం, సేవల కల్పనలో జాప్యం, పరికరాల కొరత లాంటి కారణాలతో రోగులు ప్రైవేటుబాట పడుతున్నారు. రిఫరెన్స్‌ లేనివారికి సైతం రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తున్నప్పటికీ... అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలున్నాయి.

మరిన్ని వార్తలు