ఆస్తి పన్ను బకాయితో నామినేషన్ తిరస్కరణ

21 Jan, 2016 04:38 IST|Sakshi
ఆస్తి పన్ను బకాయితో నామినేషన్ తిరస్కరణ

రిటర్నింగ్ అధికారిపై కోర్టుకెక్కిన అభ్యర్థి
జోక్యానికి హైకోర్టు నిరాకరణ
సివిల్ కోర్టుకెళ్లాలని స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్: ఆస్తి పన్ను రూ. 536 బకాయి ఉన్న కారణంగా ఓ అభ్యర్థి సమర్పించిన నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సివిల్ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప, రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడం సరికాదని తేల్చి చెప్పింది.

 ఆ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్వాన్ నియోజకవర్గానికి చెందిన జె.రవీందర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కార్వాన్, వార్డ్ నెంబర్ 65 నుంచి పోటీ చేసేందుకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి రూ. 536 ఆస్తి పన్ను బకాయి ఉందని, అలాగే ఎన్నికల అఫిడవిట్‌లో 3, 5 కాలమ్‌లను పూరించలేదంటూ అభ్యంతరం లేవనెత్తారు.

 అంతేకాకుండా రవీందర్ నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ రవీందర్ బుధవారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి లంచ్‌మోషన్ రూపంలో విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.వి.ప్రతాప్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, రవీందర్ ఈ నెల 18నే ఆస్తి పన్ను చెల్లించేశారని, అందుకు సంబంధించిన రసీదును కూడా చూపినా కూడా రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందలేదని కోర్టుకు నివేదించారు.

ఇక అఫిడవిట్‌లో 3, 5 కాలమ్‌లను పూరించాలన్న విషయం తెలియక ఖాళీగా వదిలేశారని తెలిపారు. వీటన్నింటినీ వివరిస్తూ రిటర్నింగ్ అధికారికి పిటిషనర్ వినతిపత్రం సమర్పించారని, దానిని పరిగణనలోకి తీసుకోకుండానే నామినేషన్‌ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ప్రతాప్ కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి రిటర్నింగ్ అధికారి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించారు. 

మరిన్ని వార్తలు