ఆ తీర్పు అమలును నిలిపేయండి

21 Apr, 2018 01:08 IST|Sakshi

‘కోమటిరెడ్డి, సంపత్‌’ తీర్పుపై 12 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అప్పీల్‌

అత్యవసర విచారణకు నిరాకరించిన హైకోర్టు ధర్మాసనం

అప్పీల్‌కు అనుమతిపై బుధవారం తేలుస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ రద్దు తీర్పుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఎదుట శుక్రవారం అప్పీల్‌ దాఖలైంది. తీర్పు అమలును నిలిపేయాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, జి.సాయన్న, మర్రి జనార్దన్‌రెడ్డి, గ్యాదరి కిశోర్‌ కుమార్, మాగంటి గోపీనాథ్, మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి, కె.పి.వివేకానంద, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలె యాదయ్య, రమావత్‌ రవీంద్రకుమార్‌ అప్పీల్‌ దాఖలు చేశారు.

సింగిల్‌ జడ్జి ముందు కోమటిరెడ్డి, సంపత్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఈ 12 మంది ఎమ్మెల్యేలు ప్రతివాదులు కాదు. దాంతో నిబంధనల మేరకు అప్పీల్‌ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అప్పీల్‌ను అనుమతించి అత్యవసరంగా విచారణ జరపాలన్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్‌ దాఖలుకు అనుమతించాలన్న అనుబంధ పిటిషన్‌పై బుధవారం ముందు విచారణ జరుపుతామని పేర్కొంది.

సింగిల్‌ జడ్జి తీర్పు చట్టవిరుద్దం
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌పై హెడ్‌ఫోన్‌ విసిరి గాయపరిచారంటూ కోమటిరెడ్డి, సంపత్‌లను సభ నుంచి బహిష్కరించడం, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్‌ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడం తెలిసిందే. వాటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.

బహిష్కరణను, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ శివశంకరరావు ఈ నెల 17న తీర్పునిచ్చారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వం ఎమ్మెల్యేలను రంగంలోకి దించి దానిపై అప్పీల్‌ దాఖలు చేయించింది. సింగిల్‌ జడ్జి తీర్పు ఏ రకంగా చూసినా చట్ట విరుద్ధమేనని అప్పీల్‌లో వారు వాదించారు. ‘‘కోమటిరెడ్డి, సంపత్‌ సభ్యులుగా కొనసాగేందుకు అర్హులే కాదు. సభా మర్యాదలను వారు మంటగలిపిన తీరును మాతో పాటు సభ్యులంతా చూశారు.

వారు పిటిషన్‌లో కోరిన వాటికి మించి జడ్జి అనుకూల ఉత్తర్వులిచ్చారు. అసలు వారి వ్యాజ్యాన్ని విచారణార్హంగా పరిగణించి ఉండకూడదు. వారి చర్యలు సభా ధిక్కారమే. వారి బహిష్కరణకు శాసన వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. వీడియో ఫుటేజీ ఇవ్వకపోవడం, సభ్యులకు బహిష్కరణ తీర్మానం, నోటీసు, వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ జడ్జి తప్పుబట్టారు.

కానీ సహజ న్యాయ సూత్రాల విషయంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సభ్యుల చర్యలు దుష్ప్రవర్తనే గాక సభా ధిక్కారం కూడా. ఇలాంటి వారిని అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌కు అనుమతించడం అసాధ్యం. వారేం చేశారో సభంతా చూశాక వారి వాదన వినాల్సిన అవసరమే లేదు. తప్పు చేశారని స్పష్టమవుతుంటే సహజ న్యాయ సూత్రాలను పాటించాలనడంలో అర్థమే లేదు. పైగా సభ్యుల చర్యలు సభా ధిక్కారమైనప్పుడు, వారి వాదనలు వినే విషయంలో ఎలాంటి ప్రొసీజర్‌ లేనప్పుడు తగిన తీర్మానం జారీ చేసే అధికారం సభకుందని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పునిచ్చింది’’అని పేర్కొన్నారు.

ఆ అధికరణను సుప్రీంకోర్టే ఉపయోగించగలదు
‘‘అసెంబ్లీకి కొన్ని ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయి. వాటి ప్రకారం సభ్యులను శిక్షించవచ్చు. సభా మర్యాదలకు భంగం కలిగించినా, సభను ధిక్కరించినా, ప్రతిష్టను దిగజార్చినా బాధ్యులైన సభ్యులను బహిష్కరించే అధికారం ఉంది. షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా ఉద్యోగులను శిక్షించరని జడ్జి పేర్కొన్నారు. దానికి, శాసనసభ్యుల శిక్షకు ఉన్న తేడాను విస్మరించారు. తప్పు చేసిన సభ్యులను మన్నించి వదిలేస్తే సభ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకమవుతుంది.

సభలో జరిగిన విషయాలపై న్యాయ సమీక్షకు వీల్లేదు. సభకు ప్రత్యేక, అసాధారణ అధికారాలున్నాయని జడ్జి విస్మరించారు. ఆధారాలు సమర్పించకుంటే అవి విరుద్ధంగా ఉన్నాయని భావిం చే పరిస్థితి ఈ కేసుకు వర్తించదు. జడ్జి 142వ అధికరణ కింద ఉన్న అధికారాన్ని ఉపయోగించి తీర్పునిచ్చారు. ఈ అధికారాన్ని సుప్రీంకోర్టే ఉపయోగించగలదు. ఫుటేజీ సమర్పణకు సభ తీర్మానం అవసరం లేదని పార్లమెంటరీ సభా విధానాల ను పరిశీలించకుండానే తీర్పునిచ్చారు.

న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా సభ నుంచి డాక్యుమెంట్‌ను కోరితే సభ ప్రత్యే క, అసాధారణ అధికారాలకు విలువ లేనట్లే! సభ జరుగుతుండగా జరిగిన విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు సభ తీర్మానం తప్పనిసరి. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందా, లేదా తేల్చేందుకు పార్లమెంటు, శాసనసభలే సరైన అధికార వ్యవస్థలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. జడ్జి తన తీర్పుతో సభ తీర్మానంలో జోక్యం చేసుకున్నారు’’ అని అప్పీల్‌లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు