60 వేల మందికి పన్ను లేనట్లే!

21 Jan, 2017 07:27 IST|Sakshi
60 వేల మందికి పన్ను లేనట్లే!
  • జీఎస్టీలో చిన్న వ్యాపారులకు ఉపశమనం
  • రూ.20 లక్షల పైన టర్నోవర్‌ ఉంటేనే పన్ను
  • రాష్ట్రంలో 2.2 లక్షల మంది ట్రేడర్లకు జీఎస్టీ నంబర్‌
  • వస్తు సేవల పన్నుపై జోరందుకున్న కసరత్తు
  • సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) అమలుతో రాష్ట్రంలో దాదాపు 60 వేల మందికిపైగా వ్యాపారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం వ్యాట్‌ చెల్లిస్తున్న వీరందరూ జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. జీరో ట్యాక్స్‌ (పన్ను వర్తించని) పరిధిలో చేరనున్నారు. వ్యాట్, సీఎస్‌టీ, సేల్స్‌ ట్యాక్స్, సర్వీసు ట్యాక్స్‌లన్నింటి బదులుగా ఈ ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. వ్యాట్‌తో పోలిస్తే జీఎస్టీ కనిష్ట టర్నోవర్‌ పరిమితిని పెంచటంతో చిన్న వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. ప్రస్తుతం ఏడాదికి రూ.7.5 లక్షల టర్నోవర్‌ దాటిన అన్ని వ్యాపారాలు, ఉత్పత్తులు, సేవలపై వ్యాట్‌ అమల్లో ఉంది.

    అదే జీఎస్టీలో రూ.20 లక్షల టర్నోవర్‌ దాటిన వ్యాపారులపైనే పన్ను విధిస్తారు. దీంతో రూ.7.5 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య టర్నోవర్‌ ఉన్న వ్యాపార, వాణిజ్య వర్గాలకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో 2.4 లక్షల మంది వ్యాట్‌ చెల్లించే డీలర్లు ఉండగా... ఇటీవల కేంద్రం నిర్దేశించిన గడువులోగా దాదాపు 2.2 లక్షల మంది తమ వ్యాపార లావాదేవీలను జీఎస్టీలో నమోదు చేసుకున్నారు. వారికీ ప్రొవిజనల్‌ గుర్తింపు నంబర్లను కూడా జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

    సంపన్న వ్యాపార వాటా తక్కువ
    బడా వ్యాపార, వాణిజ్య వర్గాల నుంచి వ్యాట్‌ ఆదాయం తక్కువగా వస్తోందని.. చిన్న వ్యాపారులతోనే ఎక్కువ ఆదాయం వస్తోందని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. రూ.1.5 కోట్ల టర్నోవర్‌ మించిన డీలర్ల నుంచి కేవలం ఏడు నుంచి ఎనిమిది శాతం ఆదాయం వస్తే... మిగతా డీలర్ల నుంచి 93 శాతం ఆదాయం సమకూరుతోందని పేర్కొంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్‌ ద్వారా రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. గతేడాదితో పోలిస్తే దాదాపు 16 శాతం వృద్ధి ఉన్నట్లుగా లెక్కలేసుకుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ ఆదాయం కొంతమేర తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అంతమేరకు లోటును కేంద్రం పరిహారంగా చెల్లించనుండటంతో జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి లాభ నష్టాలేమీ ఉండవని భావిస్తున్నారు.

    నోట్ల రద్దుతో జీరో దందాకు చెక్‌
    నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకు లావాదేవీలు పెరగడంతో.. జీఎస్టీలో నమోదు చేసుకునే వ్యాపారుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అం చనా వేస్తున్నాయి. గతంలో విచ్చలవిడిగా జీరో దందా చేసిన వ్యాపారు లు సైతం జీఎస్టీ గుర్తింపు పొందేందు కు దరఖాస్తు చేసుకుంటున్నారని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో జీఎస్టీలో నమోదు చేసుకునే డీలర్ల సంఖ్య ఈ ఏడాది 3 లక్షలు దాటుతుందని భావి స్తున్నారు. అందులో రూ.20 లక్షల లోపు టర్నోవర్‌ చేసే వ్యాపారులు దాదాపు 20% మేరకు ఉంటారని అంచనా. గత రెండేళ్ల వ్యాట్‌ చెల్లింపు గణాంకాల ప్రకారం 60 వేల మంది జీఎస్టీ కనిష్ట స్లాబ్‌కు దిగువన ఉంటారని.. వారంతా పన్ను మినహాయింపు పొందనున్నారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు