కాంట్రాక్టు ‘విద్యుత్’ కార్మికులకు ఊరట

22 Aug, 2016 02:55 IST|Sakshi
కాంట్రాక్టు ‘విద్యుత్’ కార్మికులకు ఊరట

- సమ్మె విరమణ ఒప్పందంలోని నాలుగు హామీలు నెరవేర్చిన ప్రభుత్వం
- విధి నిర్వహణలో మరణిస్తే రూ.10 లక్షల పరిహారం
-1,100 మంది కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మెన్ల క్రమబద్ధీకరణ
 
 సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి విద్యుత్ సంస్థలు చర్యలు ప్రారంభించాయి. జూన్ 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మెకు తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ పిలుపునివ్వగా.. రాష్ట్ర విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి జూన్ 14న ఫ్రంట్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు ఒప్పించారు. 34 డిమాం డ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునివ్వ గా, 14 డిమాండ్లను 3 నెలల వ్యవధిలో పరిష్కరిస్తామని అప్పట్లో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇచ్చాయి. వచ్చే నెల 14తో ఈ గడువు పూర్తికానుండగా, 4 హామీలను విద్యుత్ సంస్థలు నెరవేర్చాయి.

అందులో 1,100 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్‌మెన్ల క్రమబద్ధీకరణ ఒకటి. అలాగే విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.10లక్షలకు పెంచుతున్నట్లు తాజాగా ట్రాన్స్‌కో, డిస్కం లు ఉత్తర్వులు జారీ చేశాయి. క్రెడిట్ కార్డు వైద్య సేవలను వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చా యి. కాంట్రాక్టు కార్మికుల బీమాను రూ.10 లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలని ట్రేడ్‌లు యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
 
 3.26 శాతం డీఏ పెంపు

 రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని (డీఏ) 3.26% పెంచుతూ ట్రాన్స్‌కో, డిస్కంలు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తు తం 12.585% డీఏ అమలు చేస్తుండగా, గత జూలై 1 నుంచి 15.845 శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. జూలై నెలకు సంబంధించి పెరిగిన డీఏ బకాయిలను ఆగస్టు నెల జీతంతో కలిపి సెప్టెంబర్‌లో చెల్లించనున్నారు. అలాగే విద్యుత్ ప్రమాదాల్లో క్షతగాత్రులుగా మారే శాఖేతర వ్యక్తులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో, డిస్కంలు ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యుత్ ప్రమాదాల్లో 100% అంగవైకల్యం పొందిన బాధితులకే ఈ పరిహారం వర్తించనుందని పేర్కొన్నాయి.

>
మరిన్ని వార్తలు