‘పునర్విభజన’ కేసులన్నీ ఇకపై ధర్మాసనానికి..

6 Aug, 2015 00:17 IST|Sakshi

* రిట్ నిబంధనలకు హైకోర్టు సవరణ  
* గెజిట్ నోటిఫికేషన్ జారీ

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే కేసులన్నింటినీ హైకోర్టు తాజాగా ధర్మాసనం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రిట్ నిబంధనలను సవరించింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీని ప్రకారం ఇకపై పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే అన్ని కేసులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించనుంది.
 
ఇప్పటివరకు ఏ చట్టానికి సంబంధించిన నిబంధనలనైనా సరే సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలను, విభజన చట్టానికి సంబంధించి దాఖలయ్యే పిల్‌లను మాత్రమే ధర్మాసనం విచారిస్తూ వస్తోంది. అయితే పునర్విభజన చట్టానికి సంబంధించిన ఏ అంశంపైనైనా దాఖలయ్యే వ్యాజ్యాలను సింగిల్ జడ్జిలే విచారిస్తూ వస్తున్నారు. ఇలా సింగిల్ జడ్జిలు విచారించి తీర్పులివ్వడం, ఆ తీర్పులపై ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు కావడం, ధర్మాసనం తీర్పులివ్వడం వంటి ప్రక్రియ అంతటికి సమయం పడుతోంది.

పునర్విభజన చట్టం విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉండటంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు వీలుగా పునర్విభజన చట్ట సంబంధిత వ్యాజ్యాలన్నింటినీ ధర్మాసనమే విచారించాలనే అభ్యర్థనలు న్యాయవాదుల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని పరిపాలన కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు హైకోర్టు రిట్ ప్రొసీడింగ్ రూల్స్ 1977 రూల్ 14(ఏ), (4)కు బుధవారం సవరణలు చేసింది.
 
విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు ధర్మాసనానికి?
విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును సవాలు చేస్తూ.. ఉద్యోగులు (ఏపీ స్థానికత కలిగినవారిగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నవారు) దాఖలు చేసిన పిటిషన్లు కూడా ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి రెడ్డి కాంతారావు ముందు విచారణకు వచ్చాయి. టీ విద్యుత్ సంస్థల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి రిట్ రూల్స్‌కు హైకోర్టు చేసిన సవరణలను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సవరణల ప్రకారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఉద్యోగుల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన డాక్టర్ లక్ష్మీనర్సింహ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ ట్రాన్స్‌కో జారీ చేసిన ఉత్తర్వులను తాము సవాలు చేశామే తప్ప, పునర్విభజన చట్ట నిబంధనలను సవాలు చేయలేదని, అందువల్ల తమ వ్యాజ్యాలు పునర్విభజన చట్ట పరిధిలోకి రావని తెలిపారు. ఈ వాదనతో జస్టిస్ కాంతారావు ఏకీభవించలేదు.

ఈ వ్యాజ్యాలు పునర్విభజన చట్ట పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ధర్మాసనానికి నివేదిస్తానని చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది ఎస్.శ్రీరాంరెడ్డి జోక్యం చేసుకుని విచారణను గురువారానికి వాయిదా వేస్తే తమ అభ్యంతరాలను తెలియచేస్తామని చెప్పడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరించారు.

మరిన్ని వార్తలు