న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేయండి

6 Apr, 2018 01:22 IST|Sakshi

సీజేఐకి హైకోర్టు న్యాయవాద సంఘాల విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: పూర్తి స్థాయి సీజేను నియమించాలని, న్యాయమూర్తులను ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాద సంఘాలు కోరాయి. గురువారం ఢిల్లీలో జస్టిస్‌ మిశ్రాతో న్యాయవాద సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఉమ్మడి హైకోర్టుకు పూర్తి స్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఇటీవల రెండు సంఘాల ఆధ్వర్యంలో న్యాయవాదులు రెండ్రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.

దీనిపై చర్చించేందుకు ఇరు సంఘాల ప్రతినిధుల ను సీజేఐ ఆహ్వానించడంతో వారు ఢిల్లీకి వెళ్లారు. జస్టిస్‌ మిశ్రాను శాలువాతో సన్మానించారు.  పూర్తి స్థాయి సీజేను నియమించే విషయంలో తాము తీసుకున్న చర్యల గురిం చి సీజేఐ వారికి చెప్పారు. హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు సీజేఐ దృష్టికి తీసుకొచ్చారు. పెండింగ్‌ కేసుల గురించి వివరించా రు.

సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా తగిన నిర్ణ యం తీసుకుంటామని సీజేఐ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. సీజేఐని కలసిన వారిలో తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జెల్లి కనకయ్య, ఉపాధ్యక్షుడు ఎస్‌.సురేందర్‌రెడ్డి, కార్యదర్శి పి.సుజాత, సంయుక్త కార్యదర్శి ఎస్‌.చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సీహెచ్‌.ధనంజయ, ఉపాధ్యక్షుడు పి.ఆనంద్‌ శేషు, కార్యదర్శులు జ్యోతి ప్రసాద్, బాచిన హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి రూపేశ్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు