నకిలీవి ఇచ్చి.. అసలు ఐఫోన్లకు ఎసరు

13 Jul, 2016 00:05 IST|Sakshi
నకిలీవి ఇచ్చి.. అసలు ఐఫోన్లకు ఎసరు

తప్పుడు పత్రాల తో రిప్లేస్
నగరంలోని మొబైల్ షాపులకు ఢిల్లీ ముఠా టోకరా
ఇద్దరి పట్టివేత, పరారీలో ఐదుగురు నిందితులు

 

బంజారాహిల్స్: నకిలీ ఐఫోన్లను తప్పుడు ధ్రువపత్రాల సహాయంతో సెల్‌ఫోన్ షాపుల్లో రీప్లేస్ చేస్తూ మోసానికి పాల్పడుతోంది ఢిల్లీకి చెందిన ఓ ముఠా. జూబ్లీహిల్స్ పోలీసులు ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసి, 20 డూప్లికేట్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన ప్రిన్స్ మల్హోత్ర అలియాస్ సోను(22), అమన్ నాగ్‌పాల్ అలియాస్ అర్మాన్ మాలిక్(23), జితిన్ మున్ని, ధ్రువ్, నాకుల్, సత్యంతో పాటు మరో యువకుడు నెలన్నర క్రితం నగరానికి వచ్చి మాదాపూర్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నకిలీ సెల్‌ఫోన్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఐఫోన్లకు మక్కీమక్కీ నకిలీవి తయారు చేస్తూ వాటికి పత్రాలు కూడా సృష్టిస్తున్నారు. ఈ పత్రాలను చూపించి వివిధ షాపుల్లో నకిలీ ఫోన్లు రీప్లేస్ చేస్తూ.. కంపెనీ ఫోన్లు కొత్తవి తీసుకుంటున్నారు.

వాటిని ఇతరులకు అధిక మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని ఆప్ట్రానిక్స్‌లో ఇటీవల ఓ నకిలీ ఐ ఫోన్‌ను రీప్లేస్ చేస్తూ సోను, అమన్‌నాగ్‌పాల్ దొరికిపోయారు. పోలీసులు వీరిద్దరినీ విచారించగా ఢిల్లీలోని జఫర్‌మార్కెట్ నుంచి వీటిని తీసుకొస్తున్నామని చెప్పారు. వీరి నుంచి 20 నకిలీ ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోను, అమన్‌నాగ్‌పాల్ అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఐదుగురి కోసం గాలిస్తున్నారు.  కేసు దర్యాప్తులో ఉంది.
 
 

మరిన్ని వార్తలు