లెక్కలు కాదు..పక్కాగా ఉండాలి

8 Mar, 2016 00:03 IST|Sakshi
లెక్కలు కాదు..పక్కాగా ఉండాలి

మూసీ పర్యటనలో అధికారులను కోరిన మంత్రి కేటీఆర్
పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై {పశ్నల వర్షం
తత్తరపాటుకు గురైన మున్సిపల్ శాఖ అధికారులు

 
సిటీబ్యూరో : ‘మహా నగర అభివృద్ధికి సంబంధించి మేం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు అవగాహన కావాలి. మూసీకి గత వైభవం తెచ్చేందుకు మీరు చెప్పాల్సింది ఏమంటే... నగరంలో ఏ ప్రాంతం నుంచి ఎంత సీవరేజి వ స్తోంది..? గతంలో ఎంత ఫ్లో ఉండేది... ? ఇప్పుడెంత పెరిగింది ..? ఏం చేస్తే ప్రయోజనం ఉంటుందో... మీరు  గైడ్ చేయండి. వివిధ నాలాల్లో ఎంత సీవరేజీ వస్తోందో లెక్కించకుండా  పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటీ..? అని మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ప్రశ్నించారు. దుర్గం చెరువు వద్ద 5ఎంఎల్‌డి ఎస్టీపీ ఉండగా, అక్కడ 25ఎంఎల్‌డి సీవరేజీ వస్తోంది.. దాన్ని నేరుగా చెరువులో కలుపుతున్నారు. దీనివల్ల ఏం ప్రయోజనం అని మంత్రి నిలదీయడంతో అధికారులు తత్తరపాటుకు గురయ్యారు. మూసీ పర్యటనలో భాగంగా అంబర్‌పేట లోని 339 ఎంఎల్‌డి ఎస్టీపీ (సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్)ను సోమవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జలమండలి అధికారులు సీవరేజ్ నెట్‌వర్క్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ 100శాతం మురుగునీటిని శుద్ధి చేసేందుకు మనవద్ద వ్యవస్థ ఉందా..? అని ప్రశ్నించారు.

ఫలానా నగరంలో ఇలాంటి వ్యవస్థ ఉంది. హైదరాబాద్‌లో కూడా అమలు చేస్తే బాగుంటుందంటూ చెప్పాలని కోరడంతో ఎవరూ నోరు విప్పలేదు. బార్సిలోనాలో స్లార్మ్‌వాటర్ డ్రైన్లు అభివృద్ధి చేశారని మంత్రి చెబుతూ మన నగరంలో 51 నాలాలు ఉన్నాయని, ఎంత వాటర్ ఫ్లో అవుతోంది. ఓపెన్ నాలాలు ఎన్ని..? క్లోజ్డ్ నాలాలు ఎన్ని ఉన్నాయి..? ఎక్కడెక్కడ ఎస్టీపీలు నిర్మించాలో సూచించాలనడంతో అధికారులు నీళ్లు నమిలారు. నగరంలో నాలాలు ఆక్రమణలకు గురైనందున వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈపీటీఆర్ అధికారి కల్యాణ్ చక్రవర్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో కొత్తగా 10చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్స్ చేశామని అధికారులు తెలిపారు. అనంతరం జీహెచ్‌ఎంసీ అధికారులు నాగోలు నుంచి ఓఆర్‌ఆర్ ఈస్ట్ వరకు రూ.6వేల కోట్ల అంచనాతో సిద్ధం చేసిన ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. దీనిని పరిశీలించిన మంత్రి మూసీలో పిల్లర్లు వేసి పైన 26కి.మీ. దూరం రివర్ బెల్ట్‌లో స్కైవే నిర్మించేలా జీహెచ్‌ఎంసీ ప్లాన్ చేసిందని, దీనివల్ల పర్యావరణ పరంగా ఇబ్బందులేవీ లేవా అని ఆరా తీశారు. సుప్రీం కోర్టు సూనలను అధ్యయనం చేశాకే ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. మూసి దిగువ ప్రాంతంలో వాగుల అనుసంధానంపై ఇరిగేషన్ విభాగం అధికారులను అడిగారు ఆరాతీశారు. మూసీ సుందరీకరణకు నీళ్లు ఉండాలని, ఎగువ భాగంలో నీళ్లు ఆపితే కింద ప్రాంతాలైన నల్గొండ జిల్లాలో ఇబ్బందులు పడతారని, ఎంత ఫ్లో ఉంటే కిందకు నీళ్లు వెళతాయి..? రబ్బర్ డ్యాంలు ఎన్ని ఉండాలి..? అక్కడ ఎంత నీరు స్టోరేజీ ఉండాలి అని ప్రశ్నించగా, అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో ప్రస్తుతం ఉప్పల్ భగత్ వద్ద 3.3కి.మీ స్ట్రెచ్ రెడీగా ఉందని, 1కి.మీ. మేర అభివృద్ధి చేసి అక్కడ ఎంత మేర నీళ్లు ఉండాలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆదేశించారు. అయితే... మూసీలో అత్తాపూర్ వద్ద తొలి ప్రయోగం చేద్దామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించగా నెల రోజుల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని  సూచించారు. మూసీ వెంట సువాసనలు వచ్చే మొక్కలను నాటి అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండీఏ అర్భన్ ఫారెస్ట్రీ అధికారులకు ఆదేశించారు. మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు విషయంలో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇరిగేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి నెల రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
 
పర్యటన సాగిందిలా...
బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం నుంచి  ఉదయం 10.30 గంటలకు  మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, ఇరిగేషన్ విభాగాల అధికారులు మూసీ పరివాహక ప్రాంత పర్యటనకు బయలు దేరారు.తొలుత నాగోలు సమీపంలోని మూసీ బ్రిడ్జి వద్దకు 11.30గం.లకు  చేరుకొని అక్కడ హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగత్ లేఅవుట్‌ను సందర్శించారు. అనంతరం దిగువనే ఉన్న మూసీ నదిని పరిశీలించి అక్కడ సుందరీకరణకు గల అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. 12 గం.లకు అంబర్‌పేటలోని 339 ఎంఎల్‌డి ఎస్టీపీని సందర్శించారు.2.30గం.లకు తారామతి బారాదరికి చేరుకొని అక్కడ భోజనం ముగించాక 3.30గంటలకు మీడియాతో మాట్లాడారు. సరిగ్గా 4.గం.లకు బయలుదేరి బాపూ ఘాట్ వద్ద మూసీనది-ఈసీ నది కలిసే ప్రాంతాన్ని సందర్శించారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు