పగటి నిద్ర ఒంటికి చేటు కాదు!

15 Apr, 2018 01:38 IST|Sakshi

మీరు ఒళ్లు తెలియకుండా నిద్ర పోయి ఎంతకాలమైంది? పడుకోగానే నిద్రలోకి జారిపోతాను అన్నది మీ సమాధానమైతే మీరు అదృష్టవంతులే. లేదంటే మాత్రం మూడొంతుల ప్రపంచ జనాభాలో మీరూ ఒకరు. నిద్రలేమి ఉందంటే.. ఉదయాన్నే చిటపటలాడే ముఖంతో లేవాలి.. రోజంతా చిర్రుబుర్రులాడుతూ ఉండాలి.

పనులపై శ్రద్ధ తగ్గిపోతుంది..! అబ్బో ఇలాంటి సమస్యలు బోలెడున్నాయి లెండి. మరి.. తరుణోపాయం ఏమిటంటారా? ఎంచక్కా రోజుకు రెండుసార్లు కునుకేస్తే సరి అంటున్నారు నిపుణులు! సాధ్యాసాధ్యాలను కాసేపు పక్కన పెట్టేసి.. ఈ ఆలోచన వెనుక ఉన్న తర్కం ఏమిటో చూసేయండి!

రాత్రిపూట ఏకంగా 8 గంటలకు బదులుగా నాలుగు గంటల చొప్పున రెండుసార్లు నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మిగిలిన సమయమంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండేందుకు.. సృజనాత్మకత పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది.

అంతేకాదు.. దీనివల్ల మన శరీర గడియారానికి మేలు జరుగుతుంది. ఇంకో విషయం.. ఇదేదో కొత్త విషయమేమీ కాదు. మనిషి విద్యుత్తును ఉత్పత్తి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి మాత్రమే రాత్రిపూట నిద్రకు అలవాటు పడ్డాడని అంటున్నారు సోమ్నాలజిస్టులు! అదేనండి.. నిద్రపై పరిశోధనలు చేసే వైద్యులు, శాస్త్రవేత్తలు!

నడుం వాల్చడం అలవాటు చేసుకోండి
ఈ రోజుల్లో మధ్యాహ్నం కాసేపు పడుకున్నాడని తెలిస్తే.. అతడిని బద్ధకిస్టుగా ముద్ర వేయడం ఖాయం. ఈ కాలపు ఉద్యోగాలతో రోజుకు రెండుసార్లు నిద్రపోవడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అయితే ఎలాగోలా వీలు చేసుకుని మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చగలిగారనుకోండి.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల రోజంతా క్రియాశీలత, నైపుణ్యం, చురుకుదనం పెరుగుతుంది. నిద్రలేమిని అధిగమించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

రోజువారీ జీవనంలో భాగంగా మధ్య మధ్యలో నిద్ర పోవడం వల్ల జ్ఞాపకశక్తి, నేర్చుకునే తత్వం పెరగడంతో పాటు, రోజంతా మంచి మూడ్‌లో ఉంటారని 1990ల్లోనే థామస్‌ వెహర్‌ అనే మానసిక వైద్యుడు అధ్యయనాల ద్వారా స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా ఒకే పర్యాయం దీర్ఘకాలం పాటు మేల్కొనడం/నిద్ర వంటివి ఉంటే రోజు గడిచే కొద్దీ ఉత్పాదకతపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఆలోచించుకోండి మరి.. –సాక్షి హైదరాబాద్‌

ఐరోపాలో పుట్టింది..
రాత్రిపూట ఏకబిగిన ఎనిమిది గంటల పాటు నిద్రపోవడమన్న అలవాటు 1700 సంవత్సరం ప్రాంతంలో ఐరోపా దేశాల్లో మొదలైందని అంచనా. విద్యుదుత్పత్తి మొదలైన తర్వాత కృత్రిమ వెలుగులు అందుబాటులోకి రావడంతో ఉత్తర ఐరోపాలోని ఉన్నత వర్గాలు ఈ అలవాటు చేసుకున్నాయని ఆ తర్వాత ఇది పాశ్చాత్య దేశాలకు విస్తరించిందని చరిత్రకారుడు ఎ.రోజర్‌ ఇకిర్చ్‌ అంటున్నారు.

అంతకంటే ముందు.. దినచర్యలన్నీ సూర్యుడిపైనే ఎక్కువగా ఆధారపడి ఉండేవి. శారీరక వ్యవస్థ కూడా అందుకు తగ్గట్టుగా పనిచేసేది. అప్పట్లో రాత్రి 7–8 గంటల కల్లా నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామున రెండు, మూడు గంటలకే లేచి రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయేవారు. మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నడుం వాల్చడమన్నది రివాజుగా ఉండేదని మనకూ తెలుసు.

అయితే పారిశ్రామికీకరణ ఊపందుకున్నాక నిద్రపోయే సమయం తగ్గిపోయింది. నిద్రను నియంత్రించుకోవడమూ మొదలైంది. పనివేళలు పెరిగిపోవడం.. ఇల్లు.. కార్యాలయాల మధ్య ప్రయాణానికే ఎక్కువ సమయం ఖర్చయిపోతుండటం వల్ల నిద్రలేమి ఎక్కువవుతోంది. జీవనశైలి మార్పులు, రాత్రి, పగలు తేడా తెలియనంత స్థాయిలో కృత్రిమ కాంతులు పెరిగిపోవడం పరిస్థితిని మరింత దిగజార్చాయి.

మరిన్ని వార్తలు