రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలి

26 Sep, 2016 01:11 IST|Sakshi
రిజర్వేషన్లను 75 శాతానికి పెంచాలి

సాక్షి, హైదరాబాద్: దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) నేత, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథవాలె అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అగ్రవర్ణాల్లోని పేదలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన అనంతరం ఆయన రాష్ట్ర ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు ఎం.వి.రెడ్డితో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, అయితే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ఈ రిజర్వేషన్లు సరిపోవని అన్నారు. దేశంలో 77 శాతం జనాభా ఉన్న వర్గాల్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం,  ఓబీసీలకు 27 శాతం లెక్కన 49.5 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని మంత్రి అన్నారు. మరాఠా, పటేల్, జాట్, రాజ్‌పుత్ తదితర వర్గాలకు ప్రత్యేక కేటగిరీలో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఓబీసీల్లో కలపాలనే డిమాండ్‌తో కాకుండా ప్రత్యేక కేటగిరీలో రిజర్వేషన్ల కోసం అగ్రవర్ణ పేదలు పోరాడాలని సూచించారు. మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్‌కు ఆర్‌పీఐ, బీజేపీ మద్దతిచ్చాయని, కేసీఆర్ మద్దతు కోరుతున్నామని అథవాలె చెప్పారు.

దళితుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడారు. దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి, కల్యాణలక్ష్మి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ముదావహమని అన్నా రు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా పెద్దగా 350 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముంబైలో ఏర్పాటు చేయనున్నట్లు అథవాలె చెప్పారు. దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా