జంక్షన్ల వద్ద ఆంక్షలు!

11 Sep, 2016 03:41 IST|Sakshi

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు సర్కారు చర్యలు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో భారీ భవనాల నిర్మాణంపై నిషేధం విధించింది.  మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు వంటి వాటిని ప్రధాన జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేసింది. దీంతోపాటు జంక్షన్ల పరిధిలో పార్కింగ్, ప్రకటనల హోర్డింగులనూ నిషేధించిం ది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీనిపై పురపాలకశాఖ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.
 

 ప్రధాన జంక్షన్ల వద్ద అదనపు లేన్‌లు
ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ)’ కింద రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా ఎడమ వైపు (ఫ్రీ లెఫ్ట్) మలుపు తిరిగే అవకాశాన్ని కల్పించేందుకు ప్రధాన జంక్షన్ల వద్ద జీహెచ్‌ఎంసీ అదనపు లేన్‌లను నిర్మిస్తోంది.  జంక్షన్లకు సమీపంలో భారీ భవనాలకు అనుమతుల జారీపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం సైతం ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించింది.
 

 జంక్షన్ల వద్ద అమలు చేసే ఆంక్షలు..

► జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో జనం గూమికూడడానికి కారణమయ్యే మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు, స్కూళ్లు, పెట్రోల్ బంక్‌లపై నిషేధం
► జంక్షన్ల స్ల్పే పోర్షన్ (మూలమలుపు భాగాలు) పరిధిలో భవనాల ప్రవేశం, నిష్ర్కమణ ద్వారాలు ఉండరాదు. స్ల్పే పోర్షన్‌కు చుట్టూ రెయిలింగ్‌తో రక్షణ కల్పించాలి.
► ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కోసం అదనపు లేన్‌ను నిర్మించాలి.
► రోడ్డు వైశాల్యం ఆధారంగా 15-25 మీటర్ల వ్యాసార్థంలో స్ల్పే (మూల మలుపుల వద్ద ఖాళీ ప్రదేశం)ను విడిచి పెట్టాలి.  
► జంక్షన్లకు 300 మీటర్ల పరిధి వరకు వాహనాలను పార్కింగ్ చేయరాదు. 100 మీటర్ల పరిధిలోపు ప్రకటనల హోర్డింగ్‌లు ఉండకూడదు.

మరిన్ని వార్తలు