ఇళ్లు కట్టకుండానే ఎన్‌ఓసీలా?: రేవంత్‌రెడ్డి

20 Mar, 2017 03:58 IST|Sakshi
ఇళ్లు కట్టకుండానే ఎన్‌ఓసీలా?: రేవంత్‌రెడ్డి

జేవీ ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు సంస్థలతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చేసుకున్న జాయింట్‌ వెంచర్‌(జేవీ) ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒప్పందంలో భాగంగా పేదలకు ఇళ్లు కట్టకుండా, అలాగే ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సొమ్మును జమచేయకుండానే ఎన్‌ఓసీలు ఇవ్వడం ద్వారా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు. జేవీ ప్రాజెక్టుల్లోని అవినీతిపై విజిలెన్సు ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివారం సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగలేఖలో డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సంస్థలు గృహనిర్మాణం చేయాలని, వాటిలో పేదలకు 10 శాతం ఎల్‌ఐజీ ఇళ్లు, వాణిజ్య సముదాయంలో 5 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని ఒప్పందం జరిగిందని వివరించారు. దీని ప్రకారం దాదాపు రూ.3 వేలకోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని, 40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పేదలకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. వీటిని ఎగ్గొట్టడానికి ప్రైవేటు సంస్థలతో మంత్రులు ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు