-

బెయిల్ నిరాకరణ

11 Jun, 2015 04:34 IST|Sakshi
బెయిల్ నిరాకరణ

ఓటుకు నోటు కేసులో నిందితుల పిటిషన్లను కొట్టేసిన కోర్టు
రేవంత్‌కు మాత్రం 12 గంటల తాత్కాలిక బెయిల్
కూతురు నిశ్చితార్థంలో పాల్గొనేందుకు అనుమతి
ఎన్నికల ప్రక్రియను రేవంత్ కలుషితం చేశారు
తన పలుకుబడితో కేసును ప్రభావితం చేస్తారు
మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీని కనిపెట్టాల్సి ఉంది
బెయిల్ ఇవ్వొద్దని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి
♦  స్టీఫెన్‌సన్ కక్షగట్టి ఇరికించారని నిందితుల వాదన
ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు, పిటిషన్ల తిరస్కరణ


సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు బుధవారం తోసిపుచ్చింది. అయి తే కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొనేందుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిశ్చితార్థంలో రేవంత్ పాల్గొనవచ్చునని జడ్జి లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రూ.50 వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి రెండు పూచీకత్తు బాండ్లను సమర్పించాలని షరతు విధించారు. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని ఆదేశిం చారు. విచారణకు సంబంధించిన విషయాల ను బహిర్గతం చేయరాదని స్పష్టం చేశారు. రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది.
 
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు
రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రక్రియను అవినీతితో కలుషితం చేశారని, ఇది ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయడమేనని ఏసీబీ ప్రత్యేక లాయర్ వి.సురేందర్‌రావు కోర్టుకు విన్నవించారు. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తానని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రేవంత్ అన్నారని, తన పలుకుబడితో ఆయన ఎవరినైనా ప్రభావితం చేయగలరని పేర్కొన్నారు. ఓటు కోసం చేసుకున్న రూ.ఐదు కోట్ల డీల్‌లో అడ్వాన్స్‌గా ఇవ్వజూపిన రూ.50 లక్షలు పోను మిగతా రూ.4.5 కోట్ల ఆచూకీ కనిపెట్టాల్సి ఉందన్నారు. ఈ కేసులో కేవలం ఆడియో, వీడియో రికార్డులపైనే తాము ఆధారపడడం లేదని, కీలక ఆధారాలను సేకరించామని చెప్పారు.

రేవంత్ ఇప్పటికే పలు పరువునష్టం దావాలను ఎదుర్కొంటున్నారని, ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదని నివేదించారు. స్టీఫెన్‌సన్‌ను ముందుగా ఇద్దరు వ్యక్తులు కలిసి రూ.2 కోట్లు ఇస్తామన్నారని, తర్వాత సెబాస్టియన్ రూ.5 కోట్లు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. ఏసీబీలో సిబ్బంది కొరత కారణంగా నిందితుల వాంగ్మూలాలను నమోదు చేయలేకపోయామని, ఆడియో, వీడియో సీడీలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపలేకపోయామని అన్నారు.

ఈ కేసులో నిందితునిగా ఉన్న ఉదయ్‌సింహ నివాసంలో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద రేవంత్ తరఫున పలు సంస్థల నుంచి సమాచారం తీసుకున్నట్లు వాటి ద్వారా తేలిందన్నారు. స్టీఫెన్‌సన్ దగ్గరకు వెళ్లిన సమయంలో రేవంత్‌రెడ్డి తన గన్‌మెన్లను తీసుకెళ్లలేదని, ఈ కేసుతో సంబంధమున్న మత్తయ్య ఇప్పటికీ పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.
 
స్టీఫెన్ ఎంపికను వ్యతిరేకించారు
నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్‌ను ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ గతంలో మాట్లాడారని, అందుకే ఆయనపై స్టీఫెన్ కోపం పెంచుకున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా వాదనలు వినిపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు హక్కుండదని, అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని 7, 11(పబ్లిక్‌సర్వెంట్ ముడుపులు తీసుకోవడం) సెక్షన్లు ఎలా వర్తిస్తాయని, ఆ సెక్షన్లే వర్తించనప్పుడు శిక్షకు సంబంధించిన సెక్షన్ 12 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా కస్టడీ కోరడమే సరికాదని, 4 రోజులపాటు కస్టడీలోకి తీసుకుని పూర్తిగా విచారించాక కూడా బెయిల్‌ను వ్యతిరేకించడం సరికాదన్నారు.

సీజ్ చేసిన సొమ్ము ఏసీబీ దగ్గరే ఉందని, మిగతా డబ్బును కనిపెట్టేందుకు బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నామనడం సమంజసం కాదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఎక్కడికి పారిపోరని, దర్యాప్తునకు అందుబాటులోనే ఉంటారని, బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు అవకాశం లేకపోతే, కుమార్తె నిశ్చితార్థం కోసం తాత్కాలిక బెయిలైనా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. సెబాస్టియన్, ఉదయ్‌సింహ ప్రైవేటు వ్యక్తులని, వారినిప్పటికే కస్టడీలో పూర్తిస్థాయిలో విచారించిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని వారి తరఫు న్యాయవాదులు నివేదించారు. ఏసీబీ వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
 
రేవంత్‌ను కలసిన ఎమ్మెల్యేలు
చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి బుధవారం ములాఖత్‌లో కలుసుకున్నారు. దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. రేవంత్‌ను కలుసుకోవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ఆయన తమకు మిత్రుడని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు