రెవెన్యూలో గాడి తప్పిన పాలన

14 Feb, 2017 01:48 IST|Sakshi
రెవెన్యూలో గాడి తప్పిన పాలన

భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ పోస్టు ఆర్నెల్లుగా ఖాళీ
ప్రభుత్వ పథకాల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం కరువు
ఏళ్లు గడుస్తున్నా ముగియని క్రమబద్ధీకరణ ప్రక్రియ  

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలో పాలన గాడి తప్పింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగానికి దిశానిర్దేశం చేయాల్సిన పెద్దదిక్కు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెవెన్యూ విభాగంలోనే ఎంతో కీలకమైన భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టు గత ఆరు నెలలుగా ఖాళీగానే దర్శనమిస్తోంది. ప్రభుత్వం.. గత రెండున్నరేళ్లుగా ఈ పోస్టు భర్తీ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనన్న చందంగా తయారైంది. దీంతో రెండేళ్ల కిత్రం ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ (జీవో 59) కథ నేటికీ కంచికి చేరలేదు.

మరోవైపు లక్షల సంఖ్యలో వచ్చిన సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు మోక్షం కలగడం లేదు.కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరిచేందుకు 2014 డిసెంబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్పాదాయ వర్గాలకు 125 గజాలలోపు స్థలాలను ఉచిత కేటగిరీలో, ఉన్నత వర్గాలకు చెల్లింపు కేటగిరీలో ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వులలో పేర్కొంది. ఈ ప్రక్రియ అంతటినీ మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉండగా, రెండేళ్లు దాటినా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులకు పూర్తిగా మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలుమార్లు గడువును పొడిగించినా, క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ వ్యవస్థ సరిగా పనిచేయక క్షేత్రస్థాయి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దరఖాస్తు దారులు సకాలంలో సొమ్ము చెల్లించలేకపోయారని పలు జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. మరో ఆరు నెలల పాటు గడువు పెంచాలని కొందరు జిల్లా కలెక్టర్లు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి లేఖ రాసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు తాము పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించినప్పటికీ, తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

సాదాబైనామాలకూ కలగని మోక్షం
గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు తెల్లకాగితాలపై రాసుకున్న భూముల క్రయ విక్రయాలను (సాదా బైనామా) కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం 2016 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 11.16 లక్షల దరఖాస్తులు అందగా.. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది మాత్రం 34 వేల మంది రైతులకే కావడం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో 2.93 లక్షల దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించినప్పటికీ, ఇంకా ఆరున్నర లక్షలమంది దరఖాస్తు దారులకు సాదా బైనామాలను ప్రభుత్వం ఎప్పుడు క్రమబద్ధీకరిస్తుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్‌ నగరాల పరిధిలోని కొన్ని మండలాలలో సాదా బైనామాల క్రమబద్ధీకరణను తొలుత నిషేధించిన ప్రభుత్వం, ఆపై నిషేధాన్ని సడలిస్తూ గత డిసెంబరులో జీవో నెంబరు 294 జారీచేసింది. అయితే కొన్ని మండలాల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణపై నిషేధాన్ని ప్రభుత్వం సడలించినా, ఆయా మండలాలలో క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తులను స్వీకరించేందుకు సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో దరఖాస్తు చేసుకుందామనుకున్న రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు.

కొత్త జిల్లాల్లో భర్తీ కాని పోస్టులు
మరోవైపు కొత్త జిల్లాలతో కొత్తగా 125 మండలాలు, 25 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆయా పోస్టులలో పూర్తిస్థాయి తహసీల్దార్లను, ఆర్డీవోలను నియమించలేదు. మరోవైపు భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసే నిమిత్తం క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం కోసం సీసీఎల్‌ఏ అధికారులు రూ. 5 కోట్లతో కొనుగోలు చేసిన టాబ్లెట్‌ పీసీలు, గత రెండు నెలలుగా మూలనపడి పాడవుతున్నాయి. 

మరిన్ని వార్తలు