సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం

18 Sep, 2016 02:35 IST|Sakshi

సమాచార శాఖ కొత్త కార్యాలయాలపై సమీక్షలో నవీన్ మిట్టల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాల పునర్ వ్యవస్థీకరణ జరుపుతున్నామని ఆ శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నూతన జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటుపై క్షేత్ర స్థాయిల అధికారులతో శనివారం హైదరాబాద్‌లోని సమాచార భవన్‌లో సమీక్ష నిర్వహించారు.  జిల్లాల్లో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని 27 జిల్లాలకు సర్దుబాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారులు, సమాచార ఇంజనీరింగ్ విభాగం ఒకే చోట ఉండి పనిచేయాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలకు కావాల్సిన వసతి, సామగ్రి, వాహనాలు, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రతి జిల్లాలో జిల్లా అధికారిని జిల్లా పౌర సంబంధాల అధికారిగా పిలవనున్నట్టు పేర్కొన్నారు. ఐటీడీఏలు ఉన్న ఉట్నూరు, భద్రాచలం తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అదనపు పీఆర్ ఓ కార్యాలయాలు ఉంటాయని తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, శంషాబాద్, మల్కాజ్‌గిరి, సూర్యాపేటల్లో సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలోని కార్యాలయాలు నోడల్ సెంటర్లుగా పనిచేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారాన్ని పర్యవేక్షిస్తాయన్నారు. ప్రతి జిల్లాలో అడిషనల్ పీఆర్‌ఓ, ఏపీఆర్‌ఓ, ముగ్గురు పబ్లిసిటీ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, టైపిస్టు, డ్రైవర్లను కేటాయిస్తున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు డెరైక్టర్ నాగయ్య కాంబ్లీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిషోర్‌బాబు, జాయింట్ డెరైక్టర్ వెంకటేషం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు