మిల్లర్ల గిల్లుడు

11 Sep, 2016 02:35 IST|Sakshi
మిల్లర్ల గిల్లుడు

* సర్కారుకు రూ.500 కోట్ల విలువైన బియ్యం బకాయి
* ధాన్యం అట్టిపెట్టుకొని బయట అడ్డగోలు వ్యాపారం  
* రేషన్ బియ్యానికి ఏర్పడుతున్న కొరత
* దాంతో మళ్లీ అదే మిల్లర్ల వద్దే కొంటున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్ల మాయాజాలానికి ప్రభుత్వం చిత్తవుతోంది. అధికారులు, మిల్లర్ల కుమ్మక్కుతో పౌరసరఫరాల శాఖ కుదేలవుతోంది. చివరకు ప్రజా పంపిణీ (పీడీఎస్) ద్వారా అందించే రేషన్ బియ్యం కోసం అదనపు భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కస్టమ్ మిల్లింగ్ ద్వారా మిల్లర్ల నుంచి రావాల్సిన బియ్యాన్ని రాబట్టుకోలేక చేతులెత్తేసిన పౌరసరఫరాల శాఖ..

రేషన్ బియ్యానికి కొరత ఏర్పడితే మళ్లీ మిల్లర్ల దగ్గరే కొనుగోలు చేస్తోంది. ఈ శాఖలోని అధికారుల పుణ్యమాని మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కొందరు అధికారులు.. కేసులున్న మిల్లర్లకు, డిఫాల్టర్లకు సీఎంఆర్ (క స్టమ్ మిల్లింగ్ రైస్) అప్పజెప్పారు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం వల్ల మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యంతో బయట అడ్డగోలు వ్యాపారం చేసుకుంటున్నారు.
 
ఇదీ కథ!
2015-16 సంవత్సరానికిగాను 23 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించింది. ఖరీఫ్, రబీ సీజన్లు పూర్తై మరో ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా ఇప్పటి దాకా మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 14 లక్షల టన్నుల బియ్యమే అందింది. ఇంకా 1.81 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే పెండింగ్‌లో ఉంది. ఏళ్లకు ఏళ్లుగా శాఖలో పాతుకు పోయిన కొందరు అధికారులు, జిల్లా స్థాయిలో కొందరు డీఎస్‌వోలు, డీఎంలు మిల్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణ లు ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వానికి ఇంకా రూ.500 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి అందాల్సి ఉంది.

మిల్లర్ల వద్ద ఇంత పెద్దమొత్తంలో బియ్యం ఆగిపోవడంతో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం తిరిగి అదే మిల్లర్లకు డబ్బులు చెల్లించి బియ్యం కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఇలా 16 వేల టన్నుల బియ్యం కొనుగోలు చేసింది. వాస్తవానికి కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరించే బియ్యం పీడీఎస్ అవసరాలకు సరిపోవు. కచ్చితంగా బియ్యం కొనుగోలు చేయాలి. కాకపోతే ప్రభుత్వానికి రావాల్సిన 1.81 లక్షల టన్నుల బియ్యం రాక పోవడంతో కొనుగోలు తప్పలేదంటున్నారు. పరిస్థితిని మార్చేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్ష జరపనున్నారు.
 
బకాయిలే బకాయిలు..
హైదరాబాద్ మినహా మిగిలిన 9 జిల్లాల్లోని మిల్లర్లకు ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్ బాధ్యతను అప్పజెప్పింది. 2015-16 సంవత్సరానికి గాను ఖరీఫ్, రబీ సీజన్లలో వీరికి ధాన్యం అప్పజెప్పగా పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలను తమ వద్దే అట్టిపెట్టుకున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్ల నుంచి రూ.159 కోట్ల విలువైన 60 వేల టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. కరీంనగర్ జిల్లాలో సుమారు రూ.110 కోట్లు విలువ చేసే 41 వేల టన్నులకుపైగా బియ్యం అందా ల్సి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో రూ.80.55 కోట్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.50 కోట్లు, వరంగల్ జిల్లాలో రూ.38 కోట్లు, రంగారెడ్డి, మెదక్‌లో ఒక్కో జిల్లాలో రూ.23 కోట్లు, నిజామాబాద్‌లో రూ.13.50 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.5.14 కోట్ల విలువైన కస్టమ్ మిల్లింగ్ బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది.
 
ఇవిగో అక్రమాలు
అర్హతలేని, పలు కేసుల్లో సీజ్ అయిన మిల్లులకు, చివరకు విద్యుత్ కనెక్షన్ కూడా లేని మిల్లుల కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం అప్పజెప్పారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కొద్ది రోజుల కిందటే బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి.ఆనంద్ సీఎంఆర్ బకాయిలపై దృష్టి పెట్టా రు. ఆయన నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో చేసిన దాడులు అక్రమాలు బయటపడ్డాయి. ఈ మిల్లులన్నీ కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో బయట వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడైంది.

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ మిల్లులో రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేశారు. శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ మిల్లులో రూ.2.80 కోట్ల విలువైన ధాన్యాన్ని పట్టుకున్నారు. గతేడాది కడ్తాల్‌లోని వరలక్ష్మీ రైస్ మిల్లును సీజ్ చేశారు. అయినా ఆ మిల్లుకు అధికారులు ధాన్యం అప్పగించారు. దేవరకద్రలో మహాలక్ష్మి మిల్లులో సైతం రూ.74 లక్షల విలువైన ధాన్యం పట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు తమకు గడువు ఇచ్చిందని, ఈ నెలాఖరులోగా పెండింగులో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ ‘సాక్షి’కి చెప్పారు.

>
మరిన్ని వార్తలు