ఈ బియ్యం.. అమృతతుల్యం

26 Feb, 2017 04:44 IST|Sakshi
ఈ బియ్యం.. అమృతతుల్యం

పోషకాల మిశ్రమంతో బియ్యం
అందుబాటులోకి తీసుకురావాలని డబ్ల్యూహెచ్‌వో సూచన
విటమిన్ల లోపంతో బాధపడే వారికోసం ఏర్పాట్లు
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టి
రాష్ట్రంలో 60 శాతం పిల్లల్లో ఐరన్‌ లోపమున్నట్లు అంచనా


సాక్షి, హైదరాబాద్‌: రక్తహీనత, డయేరియా, గుండె జబ్బులు, షుగర్‌ తదితర అనారోగ్య సమస్యలకు కారణమయ్యే ఐరన్, విటమిన్లు, లవణాల లోపాన్ని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నడుం బిగించింది. పోషకాలు, లవణాలు, విటమిన్లు కలిగిన బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయా దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వమూ దృష్టి సారించింది. ఇటువంటి బియ్యాన్ని తయారుచేసి ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌) ద్వారా ప్రజలకు అందజేస్తే ఎలా ఉంటుందన్న దానిపై జాతీయ పోషకాహార సంస్థతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

60 శాతం చిన్నారుల్లో రక్తహీనత...
దేశంలో అత్యధికమంది బియ్యంతో తయారైన ఆహారాన్నే తీసుకుంటారు. దక్షిణ భారతంలో ఇదే ప్రధాన ఆహారం. అయితే బియ్యంలో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఐరన్‌ వంటివి ఉండటంలేదు. దీంతో బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు పోషకాల లోపంతో అనేక రోగాలకు గురవుతున్నారు. 2015–16 జాతీయ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 6 నుంచి 59 నెలల పిల్లల్లో 60.7 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 15–49 ఏళ్ల మహిళల్లో 56.9 శాతం మంది, అదే వయస్సు గల గర్భిణీల్లో 49.8 శాతం మంది, అదే వయస్సులోని 15.4 శాతం మంది పురుషులు రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరంతా ఐరన్‌ లోపం కారణంగా రక్తహీనతకు గురవుతున్నారు. దాదాపు 25 శాతం మంది పోషకాహార లోపంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన పోషకాలు లేకపోవడంతో అనేకమంది రక్తహీనత, డయేరియా, అధిక బరువు, ఎముకల జబ్బులు, గుండె సంబంధిత వ్యాధులతో అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ప్రధానంగా పేదల్లో ఉండటం గమనార్హం.

పోషకాలతో బియ్యాన్ని ఎలా తయారుచేస్తారంటే..?
బియ్యంతో తయారైన అన్నం బదులు ఇతరత్రా ఆహార పదార్థాలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఈ నేపథ్యంలో సూక్ష్మ పోషకాల మిశ్రమంతో బియ్యాన్ని తయారు చేయాలనేది డబ్ల్యూహెచ్‌వో సూచన. నిర్ణీత నిష్పత్తిలో ఐరన్, అయోడిన్, జింక్, ఫోలిక్‌ యాసిడ్, బీ1, బీ2, బీ6, బీ12, నియాసిన్‌ వంటి నీటిలో కరిగే విటమిన్లు సహా ఏ, డీ వంటి కొవ్వులో కరిగే విటమిన్లతో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని తయారు చేస్తారు. అలాగే బియ్యాన్ని దంచి, అందులో ఈ పోషకాల మిశ్రమాన్ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో వండడానికి అనువు గా తిరిగి బియ్యంగా తయారుచేస్తారు. ఈ బియ్యంలో అన్ని రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి.

ఈ బియ్యంతో పోషక లోపం నివారించవచ్చు
‘పోషకాహార బియ్యాన్ని ప్రజలకు అందజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఆయా దేశాలకు సూచించింది. ముఖ్యంగా విటమిన్లు, ఐరన్‌ వంటి లోపంతో బాధపడే పిల్లలు, పెద్దలకు ఇవి అందజేయాలి. దీనిపై జాతీయ పోషకాహార సంస్థ కూడా దృష్టిసారించింది. వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పేదలకు అందజేస్తే పోషకాహార లోపాన్ని సరిదిద్దవచ్చు.’
    –డాక్టర్‌ గంగాధర్, నెఫ్రాలజిస్ట్, నిమ్స్‌

మరిన్ని వార్తలు