‘విద్యా హక్కు’లోకి ప్రీప్రైమరీ! 

15 Jan, 2018 01:43 IST|Sakshi

అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా వర్తింపు 

ఇకపై 6 ఏళ్లలోపు పిల్లలకు ‘విద్యా హక్కు’అమలు 

సాక్షి, హైదరాబాద్‌: విద్యా హక్కు చట్టం పరిధిలోకి ఆరేళ్లలోపు పిల్లలను తీసుకురావాలని సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (కేబ్‌) నిర్ణయించింది. ఇప్పటి వరకు 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తోంది. ఈ మేరకు తమ తుది నివేదికను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. తద్వారా ప్రైవేటు పాఠశాలల్లో చదివే ప్రీప్రైమరీ విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలతో అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి వాటిల్లోని పిల్లలను విద్యాహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని తేల్చింది. విద్యా హక్కు చట్టం పరిధిలోకి ప్రీప్రైమరీ విద్య, సెకండరీ విద్యను తీసుకువచ్చేందుకు కేంద్రం ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2016 ఏప్రిల్‌ 19న సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆగ్రా బీజేపీ ఎంపీ రామ్‌శంకర్‌ కఠారియా చైర్మన్‌గా, వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ సమావేశం ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఆరేళ్లలోపు పిల్లలను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తేవాల్సిందేనని, అన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయాలని స్పష్టం చేసింది. 

పాఠశాలలతో అనుసంధాన చర్యలు.. 
దేశ వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలలతో అనుసంధానం చేసే చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. అందుకే కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు పాఠ్యాంశాలను కూడా రూపొందించింది. ప్రస్తుతం ఆరేళ్లలోపు పిల్లలకు విద్యా హక్కు చట్టాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి కోసం సమగ్ర పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల పరిధిలోకి తెచ్చే చర్యలు గతేడాదే మొదలయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 5 వేలకు పైగా పాఠశాలల ఆవరణలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించారు. రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 7,64,905 మంది ఉన్నారు.   

మరిన్ని వార్తలు