‘విద్యాహక్కు’ అమలు చేయాల్సిందే

5 Apr, 2016 03:32 IST|Sakshi
‘విద్యాహక్కు’ అమలు చేయాల్సిందే

♦ టీ సర్కార్‌కు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం
♦ ఇది ప్రభుత్వాల బాధ్యత
♦ 25 శాతం సీట్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని సూచన
 
 సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేసింది. చట్టం కూడా ఇదే చెబుతోందని, అందువల్ల ఈ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోజాలవని పేర్కొంది. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 25 శాతం సీట్ల కేటాయింపు విషయంలో తగిన విధంగా స్పందించాలని, లేకుంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది.

25 శాతం సీట్ల కేటాయింపు వ్యవహారంలో అన్ని ప్రైవేటు స్కూళ్లకు సర్క్యులర్లు జారీ చేయనున్నామని తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోర్టుకు నివేదించారు. అయితే ఆ సర్కులర్లను తమ ముందుంచాలన్న హైకోర్టు..  తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్ట నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని, అలాగే విద్యాహక్కు చట్టం కింద బలహీనవర్గాలకు 25 శాతం సీట్లు కేటాయించని పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించింది.
 
 మళ్లీ వాయిదాలంటే ఎలా?
 ఈ సందర్భంగా అదనపు ఏజీ జె.రామచంద్రరావు స్పందిస్తూ, 25 శాతం సీట్ల కేటాయింపు విషయంలో సర్క్యులర్లు జారీ చేయనున్నామని, అందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. ఇప్పటికే పలుసార్లు వాయిదాలు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు వాయిదా అడగడం ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం పాఠశాలలను ఆశ్రయించినప్పటికీ ప్రవేశాలు పొందలేకపోయిన 10 మంది విద్యార్థుల పేర్లు ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు