విద్యా హక్కుకు స.హ.చట్టం దోహదం

16 Oct, 2016 07:47 IST|Sakshi
విద్యా హక్కుకు స.హ.చట్టం దోహదం

తల్లిదండ్రుల సదస్సులో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టం సక్రమ అమలుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సమాచార హక్కుకు లోబడే ఉండాలన్న విషయం చట్టంలోని సెక్షన్- 2ఎఫ్ స్పష్టం చేస్తోందన్నారు. శనివారం ఇక్కడ నిర్వహించిన తెలంగాణ తల్లిదండ్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే సమాచార హక్కు చట్టం పనిచేస్తోందని, ఎవరూ దీని నుంచి తప్పిం చుకోలేరన్నారు.

ప్రైవేటు పాఠశాల దోపిడీని, అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం వల్లే అక్కడ ఏ నిబంధనా అమలు కావడం లేదన్నారు. సర్కారు బడులు బాగుపడాలంటే ఎవర్ని నిలదీయాలో ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్‌పర్సన్ శాంతాసిన్హా మాట్లాడుతూ పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యాపరమైన విషయాలపై బహిరంగ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకేరకమైన విద్యావిధానంను అమలు చేయాలని సూచించా రు. తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడం ద్వారానే విద్యావకాశాల్లో అంతరాలు తగ్గుతాయన్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక పరిస్థితులు క్షీణిం చడం వల్లే బాలకార్మిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నా రు. తల్లిదండ్రుల సంఘాల సలహాదారుడు ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన అనంతరం  బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన విధాన నిర్ణయాల్లో తామెక్కడున్నామని తల్లిదండ్రులు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ క్లాసులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో కేజీ టు పీజీ వరకు అన్ని రకాల వసతులు కల్పించాలని సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు