రిస్కీ జర్నీ

12 Feb, 2015 01:33 IST|Sakshi
రిస్కీ జర్నీ

కిక్కిరిసిపోతున్న ఎంఎంటీఎస్ రైళ్లు రద్దీ వేళల్లో  {పయాణికుల ఇబ్బందులు డిమాండ్ మేరకు బోగీలు పెంచని ద.మ.రైల్వే
 
సిటీబ్యూరో  మహా నగరంలో ఒక చోట నుంచి ఇంకోచోటికి ప్రయాణం ఎంతో కష్టతరంగా మారింది. ట్రాఫిక్ సమస్య, చాలీచాలని బస్సులు, అధ్వానపు రోడ్లతో నగరజీవి ప్రయాణమంటేనే హడలుతున్నాడు. ఈ దశలో నగరం నాలుగువైపుల నుంచి హైటెక్ సిటీకి మధ్య దక్షిణ మధ్యరైల్వే ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్(మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్) రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఊరటనిచ్చాయి. అయితే ఇప్పుడు ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం రద్దీ  వేళల్లో  సీట్లు  లభించక  ప్రయాణికులు గంటల తరబడి నిల్చొని ప్రయాణించవలసి వస్తోంది. కిటకిటలాడే బోగీల్లోకి దూరేందుకు అవకాశం లేక ఎంతోమంది ప్రయాణికులు మరో ట్రైన్ కోసమంటూ పడిగాపులు కాస్తూ  విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. సిటీబస్సు తరువాత ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థగా నిలిచే ఎంఎంటీఎస్ సేవలు  రోజురోజుకు వ్యధాభరితమవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో కేంద్రం  రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ సేవలపై ప్రత్యేక కథనం..

సగానికి పైగా స్టాండింగే....

ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్,ఫల క్‌నుమా-సికింద్రాబాద్  మార్గాల్లో  ప్రతి రోజు  121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. లక్షా 70 వేల మంది  ప్రయాణికులు పయనిస్తున్నారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్  కార్యాలయాల్లోకి వచ్చే ఉద్యోగులు, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్‌ల నుంచి  హైటెక్‌సిటీ, మాదాపూర్‌లోని  ఐటీ సంస్థలకు  వెళ్లే  సాఫ్ట్‌వేర్ నిపుణులు, వివిధ  కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులతో  ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రైళ్లు  కిక్కిరిసిపోతాయి. ఉదయం 7 గంటల నుంచి  10 గంటల వరకు ఆఫీసులకు చేరే సమయంలో,  సాయంత్రం 4 గంటల నుంచి 7.30 వరకు తిరిగి ఇళ్లకు చేరే సమయంలో రద్దీ నెలకొంటోంది. ఈ సమయంలోనే  ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు  అందుబాటులో ఉండడం లేదు. దీంతో సీట్ల సామర్ధ్యానికి మించి 70 శాతం ప్రయాణికులు నిల్చొనే ప్రయాణించవలసి వస్తోంది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్‌లో మొత్తం 715 సీట్లు ఉంటే  రద్దీ వేళ ల్లో  మరో 1000 మందికి పైగా  నిలబడవలసి వస్తోంది.

బోగీలు పెంచడమే  పరిష్కారం...

ఎంఎంటీఎస్ ట్రైన్‌కు  ప్రస్తుతం 9  బోగీలే  ఉన్నాయి.  వీటిలో ట్రైలర్‌కార్ బోగీలో  78  సీట్లు  ఉంటే, మోటార్‌కార్ బోగీలో  98  సీట్లు  ఉన్నాయి.  సగటున  ఒక ట్రైన్‌లో  718 మంది మాత్రమే  ప్రయాణించగలరు. కానీ డిమాండ్‌కు తగినవిధంగా  బోగీలు  పెరగకపోవడం వల్ల మరో వెయ్యిమంది అదనంగా నిలబడి పయనిస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 9 బోగీలను 12కు పెంచ డమే ఏకైక పరిష్కారం. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే  ఎలాంటి చర్యలు  తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.  లోకల్‌ట్రైన్ ఆయువుపట్టుగా ఉన్న ముంబయి నగరంలో  ఒక్కో ట్రైన్‌లో 16  బోగీలు ఉన్నాయి. కోల్‌కత్తాలోనూ  లోకల్ రైళ్లు  15  బోగీలతో  ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తుండగా, మన సిటీ ఎంఎంటీఎస్ మాత్రం  9 బోగీలకే పరిమితమైంది.
 
 ఇదీ ఎంఎంటీఎస్ ప్రస్థానం ....

మల్టిమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ నగరంలో  2003 లో  ప్రారంభమైంది. మొదట్లో  ఒక ట్రైన్‌కు  6 బోగీలే ఉండేవి.
     
2003 నుంచి 2007 వరకు 6  బోగీలు  ఉన్న  రైళ్లు  ప్రతి రోజు 65  ట్రిప్పులు  తిరిగేవి. మొదట్లో  30 వేల మంది ఉన్న  ప్రయాణికులు  క్రమంగా  50 వేలకు పెరిగారు.
     
2007 లో  బోగీల సంఖ్యను 8 కి పెంచారు. సర్వీసులు కూడా  84 కు పెరిగాయి.
     
2009 లో  కొన్ని సర్వీసులకు 9 బోగీలు పెంచారు. మరికొన్ని  8 బోగీలతోనే నడిచాయి. ఆ  ఏడాది సర్వీసుల  సంఖ్య 104 కు పెరిగింది. ప్రయాణికులు సైతం  లక్ష దాటారు.
     
2011లో  అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులకు  9 బోగీలు  పెంచారు. ఆ ఏడాది నుంచి  సర్వీసులు  కూడా  121 కి పెరిగాయి. ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంది.
   
2012-13 నాటికి   ప్రయాణికుల  సంఖ్య 1.5 లక్షలకు పెరిగింది.
     
{పస్తుతం  లక్షా 70 వేల మంది  ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు.
 
 

మరిన్ని వార్తలు