మరో డ్రంకెన్‌ ‘డెత్‌’

14 Jan, 2018 01:14 IST|Sakshi

బాసర అర్చకుడు విశ్వజిత్‌ దుర్మరణం 

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు 

జూబ్లీహిల్స్‌లో రేసింగ్‌ చేస్తూ పల్టీలు కొట్టిన కారు 

120 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ఒక్కసారిగా బ్రేక్‌  

ఫుట్‌పాత్‌ ఎక్కి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం 

హైదరాబాద్‌: డ్రంకెన్‌ ‘డెత్‌’లకు జూబ్లీహిల్స్‌ అడ్డాగా మారుతోంది. రాత్రి వేళల్లో విపరీతంగా మద్యం సేవించి వేగంగా వాహనాలు నడిపే వారి సంఖ్య ఇక్కడ పెరుగుతోంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లో డ్రంకెన్‌ ‘డెత్‌’ జరిగి వారమైనాకాకముందే ఇలాంటిదే మరో ఘటన చోటుచేసు కుంది. శుక్రవారం రాత్రి నలుగురు యువకులు మద్యం మత్తులో రేసింగ్‌ కారులో దూసుకుపోతూ ఫుట్‌పాత్‌ను ఢీకొట్టారు. దీంతో కారు ఎగిరి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బాసర పుణ్యక్షేత్రంలో సస్పెన్షన్‌కు గురైన అర్చకుడు వాల్వాకర్‌ విశ్వజిత్‌(33) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొకరు సురక్షితం గా బయటపడ్డారు.  

బాసరలో నివసించే విశ్వజిత్, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.79లో ఉండే ఆయిల్‌ వ్యాపారి డీఎల్‌ వివేక్‌ రాజ్‌(29), మల్కాజ్‌గిరికి చెందిన వెబ్‌ డిజైనర్‌ ఓర్సు పృథ్వీరాజ్‌(29), మౌలాలిలో వస్త్ర వ్యాపారి చెట్టి చెన్నకేశవ(27) స్నేహితులు. వివేక్‌ను కలిసేందుకు విశ్వజిత్‌ శుక్రవారం నగరానికి వచ్చాడు. రాత్రి 9 గంటలకు కారు సర్వీసింగ్‌ కోసం హిమాయత్‌నగర్‌కు వెళ్లిన వీరిని పృథ్వీ, చెన్నకేశవ వచ్చి కలిశారు. అనంతరం నలుగురూ వివేక్‌ ఇంటికి వచ్చారు.

వీరు వివేక్‌ వెంటో కారులో మణికొండ వెళ్లా రు. రాత్రి 12.30  వరకు అక్కడ ఓ వైన్‌షాప్‌లో ఫుల్‌ బాటిల్‌ తీసుకొని కారులో కూర్చొని మద్యం సేవించారు. అనంతరం ఫిలింనగర్‌ రోడ్‌ నం.1లో ఉన్న ఫిలించాంబర్‌ వద్దకు వచ్చి కారు రేసింగ్‌ అంటే ఏమిటో చూపిస్తానంటూ వివేక్‌ డ్రైవింగ్‌ సీటులో కూర్చున్నాడు. పక్కసీటులో పృథ్వీ, వెనుక సీటులో విశ్వజిత్, చెన్నకేశవ కూర్చున్నారు. 120 కి.మీ. వేగంతో దూసు కెళ్తూ సడెన్‌ బ్రేక్‌ వేస్తూ గంట పాటు ఆ రహదారులపై విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2.11కి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.78లో అతి వేగంతో దూసుకెళ్తూ ఒక్కసారిగా సడెన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌ ఎక్కి చెట్టు ను ఢీకొంది. వెనుక సీటులో విశ్వజిత్‌ కూర్చున్న వైపే చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన వివేక్, చెన్నకేశవలను కాచిగూడలోని ఆస్పత్రికి తరలించారు. సీటు బెల్టు ధరించడంతో పృథ్వీ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారకుడైన వివేక్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 304 పార్ట్‌(2) కింద కేసు నమోదు చేశారు.  

మృతుడు బాసర అర్చకుడు...  
బాసర పుణ్యక్షేత్రంలో అర్చకుడిగా పనిచేస్తున్న విశ్వజిత్‌ ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవ విగ్రహాల అక్రమ తరలింపులో సస్పెన్షన్‌కు గురయ్యాడు. తండ్రి సుధీర్‌ న్యాయవాది. కారు నడుపుతున్న వివేక్‌ ఆయిల్‌ బిజినెస్‌ చేస్తుండగా కారు మాత్రం తల్లి పేరు మీద ఉంది. పోలీసులు వివేక్‌కు శ్వాస పరీక్ష నిర్వహించగా బ్లడ్‌లో ఆల్కహాల్‌ కంటెంట్‌ ఉన్నట్లు తేలింది. 

>
మరిన్ని వార్తలు