రియల్టర్‌పై కాల్పులు

12 Nov, 2014 00:27 IST|Sakshi
రియల్టర్‌పై కాల్పులు

అత్తాపూర్: కారులో వెళ్తున్న రియల్టర్‌పై దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడ  పీ అండ్‌టీ కాలనీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ షాబుద్దీన్(42) నివాసముంటున్నారు. ఇతను రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌ల్లో రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నాడు.

భూములు, ప్లాట్ విషయంలో ఇతనికి పలువురితో గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా షాబుద్దీన్ సోమవారం రాత్రి 12 గంటలకు తన ఇన్నోవా కారులో హైదర్‌గూడ బాపూఘాట్‌మీదుగా ఇంటికి బయలుదేరాడు. వెనుకే వచ్చిన ఇద్దరు దుండగులు హైదర్‌గూడ ఏజీకాలనీ వాటర్ ట్యాంక్ వద్ద షాబుద్దీన్ కారుపై కాల్పులు జరిపి పారిపోయారు.

ఈ ఘటనలో  కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తు షాబుద్దీన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే ఆయన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశాడు. తనపై కాల్చిన బుల్లెట్ షెల్‌ను పోలీసులకు అప్పగించాడు.  రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసి, ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అనుమానాలు...
కాల్పులు జరిగిన తీరుపై పలు అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అర్ధరాత్రి షాబుద్దీన్ ఒంటరిగా వెళ్తున్న విషయం నిందితులకు ఎలా తెలుస్తుందని, ఇద్దరు వ్యక్తులు కారుపై కాల్పులు జరిపి పారిపోవడం వెనుక ఏదో ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, షాబుద్దీన్ తనకు ప్రాణహాని ఉందని, రివాల్వర్‌కు అనుమతి మంజూరు చేయాలని గతంలో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు