సొమ్ముల ‘పుల్లింగ్’

25 Jun, 2016 00:52 IST|Sakshi

- నగరంలో రైస్ పుల్లింగ్ పేరుతో ఇంకో దోపిడీ
- రూ.4 కోట్లకు బురిడీ కొట్టించిన మరో దొంగ బాబా
- డీజీపీ అనురాగ్ శర్మకు బాధితుడి ఫిర్యాదు
- నిందితుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సీఐడీ
 
 సాక్షి, హైదరాబాద్: ‘లైఫ్‌స్టైల్’ భవన యజమానిని 1.33 కోట్లకు బురిడీ కొట్టించిన దొంగ బాబా శివానంద ఉదంతాన్ని మరువకముందే.. ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. శివానంద బాబా మాదిరిగానే రైస్ పుల్లింగ్ పేరుతో మరో దొంగ బాబా హైదరాబాద్‌లో డబ్బున్న వారికి టోకరా వేశారు. ఉత్తరాది నుంచి వచ్చి కర్నూలులో స్థిరపడిన కోహ్లి అనే దొంగ బాబా సుమారు రూ.4 కోట్లకు ఎసరు పెట్టినట్టు సమాచారం. మోసపోయిన వ్యక్తి డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేయగా.. కేసును సీఐడీకి అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ ప్రత్యేక బృందం బెంగళూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

 రైస్ పుల్లింగ్‌తో లక్ష్మీ కటాక్షం: ‘రైస్ పుల్లింగ్ పాత్రను ఇంట్లో ఉంచుకుంటే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఈ పాత్రనుఒక్కసారి కొనుగోలు చేస్తే ఏళ్ల తరబడి లక్ష్మీదేవి కనికరిస్తుంది. కనకవర్షం కురిపిస్తుంది’ అంటూ దొంగ బాబా కోహ్లి చెప్పిన మాయ మాటలకు జూబ్లీహిల్స్‌కు చెందిన దామోదర్‌రెడ్డి అనే వ్యక్తి మోసపోయాడు. అతీత శక్తులున్న పాత్రను అందజేస్తామంటూ దశలవారీగా రూ.4 కోట్లు ఆయన నుంచి కోహ్లీ బాబా వసూలు చేశాడు. ఇటీవల శివానంద బాబా ఉదంతం వెలుగు చూడటంతో.. తాను కూడా మోసపోయినట్లు గుర్తించిన దామోదర్‌రెడ్డి డీజీపీ అనురాగ్‌శర్మను ఆశ్రయించారు. దీంతో కర్నూలుకు చెందిన కోహ్లి బాబా బెంగళూరు కేంద్రంగా చేస్తున్న రైస్ పుల్లింగ్ డ్రామాలు వెలుగుచూశాయి. దొంగబాబా ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే విచారిస్తామని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా ‘సాక్షి’కి చెప్పారు.

మరిన్ని వార్తలు