ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర

14 May, 2016 01:55 IST|Sakshi
ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్ర

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఘటనపై కొనసాగుతున్న ఉద్యమాన్ని పక్కదోవపట్టించేందుకు వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని హెచ్‌సీయూ జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నేత వెంకటేష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నిన్నటి వరకు ఉద్యమంలో ఉన్న రాజ్‌కుమార్ సాహుని బెదిరించి తమకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఈ ఘటనతో వీసీ వెనుక వెంకయ్యనాయుడు ఉన్నాడన్నది స్పష్టమైందన్నారు.


 ఏప్రిల్ 6న కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన సాహు అదేరోజు వీసీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ఏప్రిల్ 12న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఒక్కరు మినహా 948 మంది విద్యార్థులు వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మరో నేత అర్పిత అన్నారు. సంజయ్ మాట్లాడుతూ ఉద్యమ అవసరాలకోసం పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, పౌరసమాజం నుంచి ఆర్థిక సహాయం పొందారని, ప్రతిపైసా ఉద్యమానికే వినియోగించామన్నారు. ఆధారరహిత ఆరోపణలను పట్టుకొని మంత్రి వెంకయ్య నాయుడు హెచ్‌సీయూ విద్యార్థులను క్షమాపణ చెప్పాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

వీసీ అప్పారావుకు పదవిలో కొనసాగే అర్హత లేదని, ఆయనను కాపడుతున్న వెంకయ్యనాయుడు దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ఆమ్‌ఆద్మీ స్పాన్సర్డ్ ఉద్యమంగా  ముద్రవేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఉద్యోగాలు రావని, పాస్ చేయమని అధ్యాపకులు,వీసీ చేస్తున్న బెదిరింపులకు లొంగవద్దన్నారు.

మరిన్ని వార్తలు