అన్ని వర్గాలనూ మోసగించారు

29 Aug, 2014 00:55 IST|Sakshi
అన్ని వర్గాలనూ మోసగించారు

* టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా
*డ్వాక్రా రుణాలు అణాపైసలతో సహా రద్దు చేస్తామన్నారు
* ఇప్పుడు మాట మార్చి సంఘానికి రూ. లక్ష సాయం అంటున్నారు
* అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైంది?
* నేతన్నల రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారు?
* బాబు అన్ని పథకాలకూ ‘షరతులు వర్తిస్తాయి’ అంటున్నారని ఎద్దేవా
* ‘ఐరెన్‌లెగ్’ అని రోజాపై వ్యక్తిగత విమర్శలు చేసిన బొజ్జల
* బొజ్జలకంటే పెద్ద ఐరన్‌లెగ్ ఎవరూ లేరని ధీటుగా బదులిచ్చిన రోజా
* వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా మైక్ కట్ చేసిన స్పీకర్
* సభ్యునికి 5 నిమిషాల సమయమివ్వాలన్న జగన్, స్పందించని సభాపతి
* ఎస్సీ ఎస్టీల నిధులను దారి మళ్లించబోమన్న మంత్రి రావెల
* పద్దులకు ఆమోదం అనంతరం సోమవారానికి సభ వాయిదా

 
సాక్షి, హైదరాబాద్: రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, మైనార్టీలు.. సమాజంలోని అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మె ల్యే రోజా ధ్వజమెత్తారు. పద్దుల మీద గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆమె ప్రభు త్వ వైఫల్యాలను ఎండగట్టారు. 2014ను మహి ళా నామ సంవత్సరమని చెబుతున్న టీడీపీ.. మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శిం చారు. రూ. 14,204 కోట్ల డ్వాక్రా రుణాలను అణాపైసలతో సహా రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీలు గుప్పిం చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు మాట మార్చారని, సంఘాల బలోపేతానికి రూ.లక్ష సాయ మందిస్తామని కొత్త పాట అందుకున్నారని ధ్వజమెత్తారు.
 
మీకు ఓట్లేసి గెలిపించిన మహిళలు తిరగపడుతున్నారని చెప్పారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పం లోని గుడిపల్లె మండలం శెట్టిపల్లెలో మహిళలు ఐకేపీ అధికారుల మీద తిరగబడటం ఇందుకు ఉదాహరణని తెలిపారు. డ్వాక్రా సంఘాలను కేంద్రం ప్రవేశపెడితే ఆ ఘనత తనదేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అప్పులు, వడ్డీల్లో కూరుకొని అల్లాడుతున్న మహిళలకు ఏం జవాబు చెబుతారని ప్రభుత్వా న్ని నిలదీశారు.
 
 శ్రీనిధి బ్యాంక్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామని జీవో 389 ఇచ్చారని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిపి చెల్లించాలం టూ శ్రీ నిధి ఎండీ జూలై 1న నోటీసులు ఇచ్చారని తెలి పారు. బెల్ట్ షాపులు మూసేయించామని ఘనం గా ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లే దన్నారు. ఫోన్ చేస్తే మద్యం బాటిళ్లు గ్రామాల్లోకి వస్తున్నాయని, టీడీపీ కార్యకర్తలకు ఇది ఉపాధి హామీగా మారిందని అన్నారు.
 
అంగన్‌వాడీల జీతాల పెంపు ఎప్పుడు?
అంగన్‌వాడీ, ఆశా వర్కర్స్ జీతాలు పెంచుతామని ఎన్నికల్లో టీడీపీ హామీ ఇచ్చిందని, బడ్జెట్‌లో ఆ ఊసే లేదని రోజా విమర్శించారు. గతంలో వైఎస్సార్ రెండుసార్లు జీతాలు పెంచారని, మళ్లీ పెంచుతామని 2009 ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆయన మరణం తర్వా త అంగన్‌వాడీ, ఆశా వర్కర్స్ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. వారి జీతాలను రూ.10 వేలు చేయాలన్నారు. వికలాంగుల పింఛన్‌ను వైఎస్ ఏడు రెట్లు పెంచారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబు కేవలం లక్ష మందికి రూ.75 చొప్పున పింఛన్ ఇస్తే, వైఎస్ 8.5 లక్షల మందికి రూ. 500 పింఛన్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
 
సంక్షేమ పథకాలు ప్రజలను సోమరిపోతులను చేస్తాయని, వ్యవసాయం దండగని చంద్రబాబు చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు. చేనేత రుణాలు రద్దు చేస్తామని చెప్పిన టీడీపీ, ఇప్పుడు చేనేత కార్మికుల గురించి ప్రభుత్వం మాట్లాడటమే లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేమిటని ప్రశ్నిస్తే, బడ్జెట్‌లో నిధులెందుకు కేటాయించలేదని నిల దీస్తే.. టీడీపీ లేనిపోని విమర్శలకు దిగుతోందని దుయ్యబట్టారు. గతంలో ఏదో జరిగిందని విమర్శలు చేయకుండా, ఇప్పుడు ఏం చేస్తారో సమాధానం చెప్పాలన్నారు.
 
మహిళలు, మైనార్టీలు, రైతులు, చేనేత కార్మికులు, బీసీలకు ఏం జవా బు చెబుతారని నిలదీశారు.  ‘‘మనం రోడ్ల మీద హోర్డింగ్స్ చూస్తుంటాం. జీరో శాతం వడ్డీ అని రాస్తారు. కానీ కింద చిన్న చుక్క పెట్టి ‘కండిషన్స్ అప్లయ్’ అని కనిపించీ కనిపించకుండా రాస్తారు. అలాగే వేలుమీద ఓటు సిరా చుక్క పడిన తర్వాత రుణమాఫీకి ‘కండిషన్స్ అప్లయ్’ అంటున్నారు చంద్రబాబు’’ అంటూ ఎద్దేవా చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లే యించుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చాక మాటమారుస్తోందని, ప్రజల్ని మభ్య పెడుతుందని ఆమె ధ్వజమెత్తారు.
 
బీసీ ముసుగేసుకొస్తే నమ్మరు: కాలువ
బీసీల గురించి రోజా మాట్లాడటం పట్ల చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీ ముసుగు వేసుకొచ్చి మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరన్నారు. బీసీ కుటుంబ కోడలుగా తాను మాట్లాడుతున్నానని రోజా ధీటుగా సమాధానం ఇచ్చారు.
 
ఐరన్‌లెగ్ అని ఎగతాళి చేసిన టీడీపీ

రోజా మాట్లాడుతున్నప్పుడు.. ‘ఐరెన్ లెగ్’ అంటూ టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించడం వినిపించింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జోక్యం చేసుకొని.. రోజా టీడీపీలో ఉన్నప్పుడు ఇచ్చిన పత్రికా ప్రకటన చదివి వినిపించారు. ఆయన కూడా ‘ఐరెన్ లెగ్’ అని ఎగతాళిగా మాట్లాడారు. దానిని రోజా తిప్పుకొడుతూ ‘మంత్రి బొజ్జలే ఐరెన్ లెగ్. ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడే చంద్రబాబు కారు కింద బాంబు పేలింది. ఆయన కంటే పెద్ద ఐరెన్ లెగ్ ఎవరు?’ అని ప్రశ్నించారు.
 
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకున్న వైఎస్: జగన్
వ్యవసాయాన్ని దండగ అని చంద్రబాబు ఎక్కడా అనలేదని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో ప్రతిపక్ష నేత జగన్ జోక్యం చేసుకొని.. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చిన తర్వాత ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల సహాయం అందించారని గుర్తు చేశారు.
 
వైఎస్ హయాంలోనే గిరిజనులకు ఇళ్లు: రాజన్నదొర
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బలహీన వర్గాలకు 48 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే అందులో 60 శాతం ఎస్సీ, ఎస్టీలవేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. అక్రమాలు ఉంటే విచారణ జరిపి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, కానీ పేదలకు ఇచ్చే ఇల్లు-బిల్లు ఆపొద్దని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూములిచ్చిన ఘనత వైఎస్‌కే చెందుతుందన్నారు.
 
సంక్షేమ పథకాల చిరునామా వైఎస్: ఉప్పులేటి
సంక్షేమ పథకాలకు మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని విపక్ష ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రణాళికా వ్యయం కేటాయించలేదని విమర్శించారు. నిధుల్లేకుండా పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పాలని నిలదీశారు.
 
అంజాద్ బాషా మైక్ కట్ చేసిన స్పీకర్

మైనార్టీ సంక్షేమం గురించి క్లారిఫికేషన్ అడగడానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషాకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ‘ముస్లింలకు వైఎస్ 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. తర్వాత అనివార్య కారణాలవల్ల  4 శాతానికి తగ్గించారు..’ అని మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. ప్రసంగానికి అవకాశం లేదని స్పీకర్ చెప్పారు. విపక్ష నేత జగన్ జోక్యం చేసుకొని మైనార్టీ నాయకుడికి ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు.
 
టీడీపీ హయాం బీసీలకు స్వర్ణయుగం
బీసీలకు టీడీపీ హయాం స్వర్ణయుగమని, బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ పెద్దపీట వేశారని టీడీపీ సభ్యుడు కె.రవికుమార్ తెలిపారు. బీసీలకు అన్యాయం చేశారంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను విమర్శించారు. ఆయన చేసిన విమర్శలకు స్పందించడానికి, క్లారిఫికేషన్ తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్న విపక్ష సభ్యుల వినతిని స్పీకర్ పట్టించుకోలేదు. విపక్ష సభ్యులు సభకు అంతరాయం కలిగిస్తే.. వైఎస్సార్‌సీపీకి కేటాయించిన సమయంలో కోత విధిస్తామని హెచ్చరించారు.
 
నిధులను దారిమళ్లించం: మంత్రి రావెల
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులను గతంలో మాదిరి దారి మళ్లించకుండా ఖర్చు చేస్తామని పద్దులపై జరిగిన చర్చకు జవాబిస్తూ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ  మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు నిధులు తక్కువే కేటాయించారని, మళ్లీ ఆర్థిక మంత్రిని కలిసి మరిన్ని నిధులివ్వాలని కోరతామని  మంత్రి పీతల సుజాత తెలిపారు. పద్దులకు సభ ఆమోదం తెలిపాక సోమవారానికి వాయిదా వేశారు.

3 సార్లు మైక్ కట్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళల రుణాల మాఫీ హామీ అంశంపై గురువారం శాసనసభలో గందరగోళం చెలరేగింది. డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై చర్చకోసం విపక్ష సభ్యులు ఉప్పులేటి కల్పన, రోజాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిం చారు. అయితే చర్చకు రోజా పట్టుబట్టడంతో స్పీకర్ ఒక్క నిమిషం మాట్లాడేందుకు అనుమతించారు. కానీ రోజా ‘ఈ ప్రభుత్వం...’ అం టూ ఉండగానే.. ‘నో.. నో.. ఈ అంశంపై చర్చ లేద’ంటూ స్పీకర్ మైక్‌ను కట్‌చేశారు. దీనిపై విపక్ష సభ్యులు వాదనకు దిగడంతో మరోసారి అనుమతించారు. రోజా మైకు అందుకుని.. ‘ఎన్నికల ప్రణాళికలో డ్వాక్రా మహిళలకు రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని టీటీపీ హామీ ఇచ్చింది’ అంటూ ఉండగానే మళ్లీ మైక్ కట్ చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడి యం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు.
 
విపక్ష సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో 5 నిమిషాలు గడిచాక రోజా మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించారు. ఈసారి ఆమె.. ‘14 వేల 200 కోట్ల రూపాయలు పూర్తిగా రద్దు...’ అంటూ ఉండగానే మైక్ కట్ అయిపోయింది. ఈ చర్చను అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేస్తూ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్న ట్టు ప్రకటించారు. నిమిషం కాకుండానే మైకు ఎందుకు కట్ చేస్తున్నారంటూ విపక్ష సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈలోగా మం త్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పీలేరు నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులపై చింతల రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కానీ సభలో గందరగోళం నెలకొని ఉండటంతో ఆయనేం చెప్పారో ఎవరికీ అర్థం కాలేదు. పరిస్థితి అదుపులో లేకపోవడంతో స్పీ కర్ 9.15 గంటలప్పుడు సభను వాయిదా వేశారు. తిరిగి 10.47 గంటలకు ప్రారంభమయ్యేసరికి ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది.

>
మరిన్ని వార్తలు