ఆశా, అంగన్‌వాడీలకూ ఈఎస్‌ఐ సేవలు

13 Feb, 2016 03:43 IST|Sakshi
ఆశా, అంగన్‌వాడీలకూ ఈఎస్‌ఐ సేవలు

♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ
♦ రూ.250 నెలసరి మొత్తంతో కుటుంబం మొత్తానికి వైద్య సదుపాయం
♦ ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లోని అన్ని సేవలూ అందేలా కొత్త పథకం
 
 సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగంలోని కార్మికులకూ వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఇందులో భాగంగా ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల కుటుంబాలకు ఈఎస్‌ఐ సేవలను విస్తరించేందుకు ఒక పథకాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. నిర్మాణ రంగ కూలీల కోసం వైద్యబీమా పథకాన్ని ఇప్పటికే ప్రారంభించగా, రిక్షా కార్మికులు, ఆటోడ్రైవర్లకు ఢిల్లీ, హైదరాబాద్‌లలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ సేవలు అందిస్తామని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) 168వ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి ఆ సమావేశం వివరాలను విలేకరులకు వివరించారు. ఆశా, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నెలకు రూ.250 చెల్లించడం ద్వారా ఈఎస్‌ఐ పథకంలో భాగస్వాములు కావచ్చునని, దీని ద్వారా ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని వైద్య సేవలను పొందడానికి కార్మికుడి కుటుంబానికి అర్హత లభిస్తుందని మంత్రి వివరించారు. ఈఎస్‌ఐ సేవలు పొందడానికి ఉన్న గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ఆలోచన చేస్తున్నామని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

 విజయవాడలో ప్రాంతీయ కేంద్రం
 ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ఈఎస్‌ఐ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించిందని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. దీంతో ఇప్పటివరకూ విజయవాడలో ఉన్న ఉప ప్రాంతీయ కేంద్రం ఆ రాష్ట్రానికి ప్రధాన కేంద్రమవుతుందని, తిరుపతిలో కొత్తగా ఒక ఉప ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. విజయవాడ కేంద్రానికి డెరైక్టర్‌గా పి.శివప్రసాద్‌ను నియమించినట్లు మంత్రి తెలిపారు.
 
 సనత్‌నగర్ ఆసుపత్రి స్థాయి పెంపు..
 సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని 500 పడకల స్థాయికి పెంచనున్నామని, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని దత్తాత్రేయ తెలిపారు. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, దాన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు మార్చి.. ఖాళీ అయ్యే స్థలంలో అధునాతన హంగులతో 500 పడకల ఆసుపత్రిని నిర్మించాలన్నది తమ ప్రణాళిక అని వివరించారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ వైద్యకళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి పనిచేయడం మొదలుపెడుతుందన్నారు. ఈఎస్‌ఐ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన వీడియో ప్రకటనను మంత్రి విడుదల చేశారు. 15వ తేదీ నుంచి టీవీ చానళ్లు, సినిమాహాళ్లలో ఈ ప్రకటన ప్రసారమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు