రూ.3వేల కోట్ల గ్రాంట్లు నిలిపివేత

4 Sep, 2016 20:56 IST|Sakshi

- రావాల్సిన నిధులను విడుదల చేయని కేంద్రం
- సంక్షోభంలో వైద్య ఆరోగ్యశాఖ పథకాలు
- కొన్ని విభాగాల్లో జీతాలకూ కటకట
సాక్షి, హైదరాబాద్

 కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సుమారు రూ.3 వేల కోట్లపైనే నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న పలు పథకాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల కావాల్సిన ప్రధానమంత్రి స్వాస్థీయ సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) పథకానికి చెందిన సుమారు రూ.400 కోట్లు పైనే ఇప్పటివరకూ రాలేదు. విశాఖపట్నంలో మెడ్‌టెక్ పార్క్ జోన్ ఏర్పాటుకు రూ.92 కోట్లు రాష్ట్రమిస్తే, మరో రూ.92 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది.

 

అయితే నేటికీ కేంద్రం రావాల్సిన నిధులివ్వలేదు. ఇక జాతీయ ఆరోగ్యమిషన్ నిధులు కూడా సకాలంలో రాలేదు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి నుంచి వచ్చే నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. నిధులివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గత మూడు మాసాల్లో నాలుగు లేఖలిచ్చినా కేంద్రం వీటిని చెత్తబుట్టలో వేసినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరు, నిధుల వ్యయంపై ఇప్పటికే కేంద్రం పలుసార్లు హెచ్చరించింది. ఇటీవల కేంద్రం నుంచి రూ.56 కోట్లు పట్టణ ఆరోగ్యం మెరుగు పర్చండి అని నిధులిస్తే.. ఏకంగా ఈ - యూపీహెచ్‌సీల పేరుతో ప్రైవేటుకు అప్పజెప్పారు.

 

అలాగే పథకాల నిర్వహణను ఆఫ్‌లైన్ టెండర్ల ద్వారా పిలిచి అప్పగించడం, జాతీయ ఆరోగ్యమిషన్ నిధుల వ్యయంపై రసీదులు, వోచర్లు ఇవ్వకపోవడం వంటివాటిపై కేంద్రం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆరోగ్యశాఖలో పథకాలన్నీ కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అమలవుతున్న 95 శాతం ఆరోగ్య పథకాలన్నీ కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పథకాలకు చేస్తున్న వ్యయం, దానికి సంబంధించిన లెక్కల్లో పారదర్శకత లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల నుంచి గత మూడేళ్లలో ఖర్చు చేసిన వ్యయాలకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇప్పటికీ సరిగా లేవు. ఇలా ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవకతవకలు జరగడం, లేదా సరిగా అమలు చెయ్యకపోవడం వల్లే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకనే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు