కారు అద్దాలు పగులగొట్టి రూ.30 లక్షల చోరీ

28 Aug, 2013 02:38 IST|Sakshi

 పంజగుట్ట, న్యూస్‌లైన్: పట్టపగలే జాతీయ రహదారిపై పార్కింగ్ చేసి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి అందులోంచి రూ.30 లక్షల నగదు ఉంచిన బ్యాగ్‌ను దొంగిలించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కాంట్రాక్టర్ సంజీవ్‌రెడ్డి గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఎస్సార్‌నగర్‌లో నివాసముంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఇంట్లో ఉన్న రూ.19లక్షల నగదును ఓ బ్యాగ్‌లో ఉంచి ఎస్సార్‌నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో మరో రూ.11లక్షలు డ్రా చేశారు. మొత్తం రూ.30 లక్షలను ఒక బ్యాగ్‌లో ఉంచారు. ఈ డబ్బుతో మదనపల్లిలో స్థలం కొనే యోచనతో మొత్తం రూ.30 లక్షలను జమచేశారు.
 
  ఈ డబ్బును తన స్కోడా కారు (ఏపీ09సీఎల్8998)లో ముందు సీటు కింద పెట్టారు. అనంతరం తన భార్యతో కలిసి అమీర్‌పేటలోని బిగ్‌బజార్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వైద్యపరీక్షల నిమిత్తం వెళ్లారు. అప్పుడే రెండు పల్సర్ వాహనాలపై వచ్చిన నలుగురు యువకులు అక్కడకు చేరుకున్నారు. ముందుగా ఒక యువకుడు శ్రీకృష్ణ డయాగ్నస్టిక్‌కు చెందిన అంబులెన్స్ డ్రైవర్ అబ్బాస్ వద్ధకు వెళ్లి మీ డయాగ్నస్టిక్ సెంటర్‌లో రక్తపరీక్షలు చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుందంటూ మాటల్లో పెట్టాడు. వెనక నుంచి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు కారు ముందు భాగంలో ఎడమ వైపు ఉన్న అద్దాన్ని పగులగొట్టి సీటు కింద ఉంచిన రూ.30 లక్షల బ్యాగ్‌ను తీసుకొని అప్పటికే రెడీగా ఉన్న మరో వ్యక్తితో పల్సర్ వాహనంపై ఎక్కి పరారయ్యారు. అబ్బాస్‌తో మాట్లాడుతున్న వ్యక్తి కూడా వెనక నుంచి వచ్చిన మరో పల్సర్ వాహనంపై ఎక్కి పరారయ్యాడు.
 
 అబ్బాస్‌తో పాటు అక్కడ ఉన్న స్థానికులు గమనించి వారిని పట్టుకునేందుకు గట్టిగా కేకలు వేస్తూ విఫల యత్నం చేశారు. నిందితులు సెకన్ల వ్యవధిలో వాహనాన్ని వేగంగా నడుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. సొత్తు దోచుకున్న వారంతా యువకులేనని, నిందితులు హెల్మెట్లు ధరించారని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. క్షణాల్లో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు ఖంగుతిన్నారు.
 
 సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..
 సంఘటన స్థలానికి పంజగుట్ట ఏసీపీ వెంకటనర్సయ్య, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సత్తయ్య, ఎస్సార్‌నగర్ క్రైం ఇన్‌స్పెక్టర్‌లు పరిశీలించారు. క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు

మరిన్ని వార్తలు