శతకోటి సమస్యల్లో ‘డయల్-100’

1 Aug, 2014 01:08 IST|Sakshi

 ఉమ్మడి రాష్ట్రంలో జీవీకే(ఈఎంఆర్‌ఐ)తో నిర్వహణా ఒప్పందం
 ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుకు రూ.51 కోట్లు అవసరం
 రాజధాని తేలకుండా ఎక్కడ ఏర్పాటు చేయాలి?

 
 
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే రంగంలోకి దిగేందుకు పోలీసు విభాగం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘డయల్ 100’ రాష్ట్ర విభజనతో సమస్యలను ఎదుర్కొంటోంది. ఫోన్ ద్వారా అందే ఫిర్యాదులను కంట్రోల్ రూం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరవేసి స్పందనను కూడా పర్యవేక్షించటం ‘డయల్ 100’ బాధ్యత.

ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు ‘108’ సేవల్ని అందిస్తున్న జీవీకే-ఈఎంఆర్‌ఐతో నిర్వహణా ఒప్పందం కుదిరింది. విభజన తరువాత హైదరాబాద్-సైబరాబాద్‌ల్లో డయల్ 100 వ్యవస్థను పటిష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని పర్యవేక్షించే 108 వ్యవస్థ అంతా హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
 
ఎవరి ఖర్చు ఎంత: గతేడాది ‘డయల్-100’ ప్రారంభించినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని 1,681 పోలీస్‌స్టేషన్లను అనుసంధానించారు. ఫిర్యాదులపై రహస్యంగా విచారించాల్సి ఉన్నందున ‘డయల్ -100’ పర్యవేక్షణకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నందున నిర్వహణ కింద ‘జీవీకే-ఈఎంఆర్‌ఐ’కి ఏటా నిర్ణీత మొత్తం చెల్లించేలా పోలీసు విభాగం ఒప్పందం చేసుకుంది.
 
విభజన తరవాత దీని అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘డయల్-100’ వ్యవస్థను ఉమ్మడిగా వినియోగించుకోవాలంటే నిర్వహణా వ్యయంలో సగం చెల్లిస్తే సరిపోతుందని తొలుత చెప్పిన తెలంగాణ పోలీస్ అధికారులు అనంతరం మూలధన వ్యయంలోనూ సగం చెల్లించాలంటూ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించాల్సి ఉండటంతో ఈ మొత్తం చెల్లించాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు మాత్రం నెలకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
 
పోనీ తెలంగాణతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా డయల్ 100 ఏర్పాటు చేద్దామన్నా ‘రాజధాని’ సమస్యగా మారింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇందుకు రూ.35 కోట్లు అవసరం. ఇక మూలధన వ్యయం కింద మరో రూ.9 కోట్లు, నిర్వహణా వ్యయం కోసం మరో రూ.5 కోట్లు నుంచి రూ.7 కోట్లు తప్పనిసరి. ఇంత ఖర్చు పెట్టి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాలన్నా ఇంకా రాజధాని నగరం ఏదో తేలకపోవడంతో ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సమస్యగా మారుతోంది. ఆగస్టు 15వ తేదీలోగా ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు