కొలిక్కిరాని పైసల పంచాయితీ

6 Jul, 2017 02:00 IST|Sakshi
కొలిక్కిరాని పైసల పంచాయితీ
- ఏపీఎంఎస్‌ఐడీసీకి తెలంగాణ ఉద్యోగుల తాళం
సామగ్రి విజయవాడకు తరలిస్తుండగా నిరసన
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి రూ.70 కోట్ల బాకీ
 
సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖలో విభజన వివాదాలు ఇంకా కొలిక్కి రావడంలేదు. తొమ్మిదో షెడ్యూల్‌లోని వైద్య సేవలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఎంఎస్‌ఐడీసీ)లో పైసల పంచాయితీ మరోసారి రగిలింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలోని సామగ్రిని విజయవాడకు తరలిస్తున్నారని తెలుసుకొని టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఉద్యోగులు బుధవారం అక్కడికి వెళ్లారు. విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణకు రావాల్సిన రూ.70 కోట్లను విడుదల చేయాలంటూ ఏపీ ఎంఎస్‌ఐడీసీకి తాళం వేశారు. ఈ సంస్థ ఆస్పత్రులకు అవసరమైన మందులను, సామగ్రిని కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది.

అభివృద్ధి పనులను చేయిస్తుంది. టెండర్ల ప్రక్రియ సమయంలో కాంట్రాక్టర్లు ఆయా పనులకు కేటాయించిన మొత్తంలో ఏడు శాతాన్ని ఈఎండీగా చెల్లిస్తారు. పనులు పూర్తి చేసి బిల్లులు తీసుకునే సమయంలో ఈఎండీ మొత్తాన్ని సైతం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణలో పనులు పూర్తి చేసినవారికి చెల్లించాల్సిన మొత్తం ఏపీఎంఎస్‌ఐడీసీ బ్యాంకు ఖాతాలోనే ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియ సమయంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఆస్తులను, నిధులను చార్టర్డ్‌ అకౌంటెంట్‌లు లెక్కలు వేశారు. తెలంగాణకు రూ.70 కోట్లు ఇవ్వాలని సంస్థ మేనేజింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఇది జరిగి మూడేళ్లు అవుతున్నా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి రావాల్సిన బాకీని ఏపీఎంఎస్‌ఐడీసీ చెల్లించడంలేదు. ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు ఈ నిధులను మూడు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు.

తమకు రావాల్సిన నిధులను తమ ఖాతాల్లో జమ చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులు బ్యాంకులకు గతంలోనే పలుసార్లు లేఖలు రాశారు. దీనికి ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారుల నుంచి స్పందన లేదు. మరోవైపు ఏపీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలోని సామాన్లను విజయవాడకు తరలించాలని ఆ సంస్థ అధికారులు నిర్ణయించారు. రెండు రోజులుగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చీఫ్‌ ఇంజనీరు, మరో ఇద్దరు అధికారులు మంగళవారం ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ వెంకటగోపినాథ్‌ వద్దకు వెళ్లారు. అయితే, ఆయన తెలంగాణ అధికారులను కలిసేందుకు ఇష్టపడలేదని తెలిసింది. దీంతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఉద్యోగులు పలువురు ఏపీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలోని ఫైనాన్స్‌ విభాగం గదికి తాళం వేశారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి రావాల్సిన రూ.70 కోట్లను వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. 
>
మరిన్ని వార్తలు