మన సూరీడు మరీ హాట్ గురూ!

25 Jan, 2016 04:44 IST|Sakshi
మన సూరీడు మరీ హాట్ గురూ!

సాక్షి, హైదరాబాద్

ప్రైవేటు కంపెనీలకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం.. ఆ మేరకు లబ్ధి పొందడం.. అందుకోసం అడ్డొచ్చిన నిబంధనలను మార్చడం లేదా ఏమార్చడం... అవసరమైతే ప్రభుత్వరంగ సంస్థలను కూడా అడ్డగోలుగా వాడుకోవడం.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతోంది... రాష్ర్టంలో పెచ్చరిల్లిన అవినీతి... ఆరు కంపెనీలు - అరవై కాంట్రాక్టులుగా విలసిల్లుతోంది..

 

తాజాగా.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో)లో భారీ అవినీతి వ్యవహారానికి రంగం సిద్ధం చేశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను లొసుగుల మయంగా మార్చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తమకు నచ్చిన కంపెనీలకు ఎక్కువ రేట్లకు కాంట్రాక్టులు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దీనివల్ల దాదాపు రూ.755 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అంటే రూ. 755 కోట్ల ప్రజాధనాన్ని ప్రయివేటు కంపెనీలు స్వాహా చేయనున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ను అడ్డంపెట్టుకుని ప్రయివేటు కంపెనీలకు దోచిపెట్టేందుకు భారీ గూడుపుఠాణీ జరిగింది.

ఆ ప్రాజెక్టేమిటో.. ప్రయివేటు కంపెనీలకు ఎలా మేలు చేస్తున్నారో చూడండి...

- ఏపీ ‘సోలార్’... 755 కోట్ల గోల్‌మాల్

-  సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ఎక్కువ రేట్లకు కాంట్రాక్టులు

- బీహెచ్‌ఈఎల్‌ను ముందుపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు

- మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో మెగావాట్ నిర్మాణ వ్యయం రూ. 5.6 కోట్లు..

- రాష్ర్టంలో మెగావాట్ నిర్మాణ వ్యయం రూ. 4.75 కోట్లు మించదంటున్న నిపుణులు

- అయినా మెగావాట్ రూ. 6.26 కోట్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం..

- ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టే మొత్తం రూ. 755 కోట్లు

 

ఇదీ ప్రాజెక్టు...

ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారిచెర్వు వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం 3 వేల ఎకరాలను ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ సేకరిస్తోంది. ఈ ప్రాజెక్టును 100 మెగావాట్లకు ఒకటి చొప్పున 5 బ్లాకులుగా విడదీసి ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో టెండర్లను ఆహ్వానించారు. డిసెంబర్ 15న టెండర్లు తెరిచారు.

 

బీహెచ్‌ఈఎల్‌ను ముందుపెట్టి...

మెగావాట్‌కు రూ. 6.26 కోట్లు కోట్ చేసిన ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ ఎల్-1గా నిలిచింది. స్టెర్లింగ్, టాటా, ఎల్ అండ్ టీ, మెగా వంటి ప్రయివేటు సంస్థలు అంతకన్నా ఎక్కువ కోట్ చేశాయి.  తక్కువ రేటు కోట్ చేసిన బీహెచ్‌ఈఎల్ రేటుతో మిగతా సంస్థలకూ మిగిలిన బ్లాకుల కాంట్రాక్టులు ఖరారు చేశారు. ఏపీజెన్‌కో బోర్డు వీటిని ప్రకటించడమే తరువాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ మరింత తక్కువకే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు రావలసింది.

 

కానీ ప్రయివేటు కంపెనీల ప్రయోజనం కోసం ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లమేరకు బీహెచ్‌ఈఎల్ అధికారులు అంత ఎక్కువ ధర కోట్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎల్ 1 గా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ కోట్‌చేసిన మొత్తానికే మిగిలిన బ్లాకులను మిగతా కంపెనీలకు కాంట్రాక్టు ఇస్తున్నామని చెప్పుకోవడానికే బీహెచ్‌ఈఎల్‌ను రాష్ర్టప్రభుత్వం తెరపైన ప్రముఖంగా చూపిస్తున్నదన్న విమర్శలూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు నుంచి బీహెచ్‌ఈఎల్ ఎప్పుడైనా తప్పుకునేందుకు, ఆ బ్లాకును ప్రాజెక్టులోని అర్హత పొందిన మిగిలిన కంపెనీలలో దేనికైనా అప్పగించేందుకు వీలుగా నిబంధనలు ఉన్నాయి.

 

బీహెచ్‌ఈఎల్ కొటేషన్‌లో తేడాలెందుకొచ్చాయి?

మధ్యప్రదేశ్‌లో 50 మెగావాట్ల సామర్థ్యం గలిగిన 5 సోలార్ పవర్ ప్రాజెక్టులకు, రాజస్థాన్‌లో 65 మెగావాట్ల సామర్థ్యం గలిగిన 4 ప్రాజెక్టులకు జరిగిన బిడ్డింగ్‌లో బీహెచ్‌ఈఎల్ పాల్గొంది. అక్కడ మెగావాట్‌కు ఎంత కోట్ చేసిందో తెలుసా? రూ. 5.6 కోట్లు. ఈ రెండు రాష్ట్రాలలోనూ దేశీయంగా తయారైన సోలార్ ప్యానెల్స్ వాడాలన్న నిబంధన ఉంది. విదేశాల నుంచి దిగుమతవుతున్న ప్యానెల్స్‌తో పోలిస్తే వీటి ధర చాలా ఎక్కువ. ఏపీజెన్‌కో అలాంటి నిబంధనేదీ విధించలేదు. విదేశీ ప్యానెల్స్ వాడవచ్చు.

 

అంటే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మెగావాట్‌కు రూ.70 లక్షలు అదనంగా ఖర్చవుతుంది. అయినా ఆ రెండు రాష్ట్రాలలో మెగావాట్‌కు రూ. 5.6 కోట్లు కోట్ చేసిన బీహెచ్‌ఈఎల్ ఆంధ్రప్రదేశ్‌లో మెగావాట్‌కు రూ. 6.26 కోట్లు ఎందుకు కోట్‌చేసింది? దీని వెనక ఎవరి వత్తిళ్లున్నాయి? అలా ఎక్కువ కోట్ చేయడం వల్ల ఇక్కడ ఎవరికి ప్రయోజనం? ఈ ప్రాజెక్టులో బీహెచ్‌ఈఎల్‌తో పాటు బిడ్డింగ్‌లో మిగిలిన నాలుగు ప్రయివేటు కంపెనీలకే కదా? ఆ కంపెనీల కోసం బీహెచ్‌ఈఎల్ ఇలాంటి పని చేసిందంటే దానిపై ‘ఏ స్థాయి’లో వత్తిళ్లు వచ్చాయో..

 

ఐదుకంపెనీలే ఎలా మిగిలాయంటే..

తమకు నచ్చిన ప్రయివేటు కంపెనీలు మాత్రమే బిడ్డింగ్‌లో మిగిలేలా ఏపీజెన్‌కో టెండర్ మార్గదర్శకాలను మార్చేసింది. రాష్ర్టంలో ఎన్టీపీసీ 750 మెగావాట్ల (125ఁ 6) ప్లాంట్లను నిర్మిస్తుండగా ఏపీజెన్‌కో 500 మెగావాట్ల (100ఁ5) ప్లాంట్లను నిర్మిస్తోంది. అయితే ఇందుకోసం విధించిన అర్హతల మార్గదర్శకాలను చూస్తే ఏపీజెన్‌కోలో తమకు నచ్చిన ప్రయివేటు కంపెనీల కోసం ఆడిన నాటకం సులువుగానే అర్ధమౌతుంది.

 

1. ఎన్టీపీసీ రూ.285 కోట్ల వార్షిక టర్నోవర్ నిబంధన విధించగా ఎపీ జెన్‌కో రూ.600 కోట్ల వార్షిక టర్నోవర్ నిబంధన విధించింది.

2. గతంలో 10 మెగావాట్ల ప్లాంట్లు 4 నిర్మించిన అనుభవం ఉంటే చాలునని ఎన్టీపీసీ నిబంధన చెబుతోంది. కానీ 25 మెగావాట్ల ప్లాంట్లు రెండు నిర్మించిన అనుభవం ఉండాలని ఏపీ జెన్‌కో నిబంధన విధించింది.

 దీంతో ఎపీజెన్‌కో బిడ్డింగ్‌కు అనేక సంస్థలు దూరమయ్యాయి. ఎన్టీపీసీ బిడ్డింగ్‌లో 11 కంపెనీలు అర్హత సాధించగా ఏపీ జెన్‌కో ప్రాజెక్టులకు కేవలం 5 కంపెనీలే బిడ్డింగ్‌లో మిగిలాయి.

 

నష్టం రూ. 755 కోట్లు...

సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఇస్తున్న కాంట్రాక్టు మొత్తం.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. రాజస్థాన్‌లో ఇటీవలే  65 మెగావాట్ల ప్లాంట్‌ను ‘టాటా సోలార్’ సంస్థ మెగావాట్ రూ. 5.6 కోట్లకు దక్కించుకుంది. అంటే ఏపీ జెన్‌కో ప్రాజెక్టుతో పోలిస్తే మెగావాట్‌కు రూ. 70 లక్షలు అధికం. రాజస్థాన్‌లో దేశీయంగా తయారైన సోలార్ ప్యానెల్స్ వాడాల్సిన నిబంధన ఉంది. అవి నాణ్యమైనవే కాక ధర కూడా చాలా ఎక్కువ.

 

కానీ ఏపీజెన్‌కో ప్రాజెక్టులో చౌకగా దొరికే విదేశీ సోలార్ ప్యానెల్స్ వాడేందుకు వెసులుబాటు ఉంది. రాజస్థాన్‌లో టాటా సోలార్ సంస్థ కొటేషన్ చూసినా, చౌకైన విదేశీ సోలార్ ప్యానెల్స్ వాడేందుకు వెసులుబాటు ఉండడాన్ని బట్టి చూసినా ఏపీజెన్‌కో ప్రాజెక్టు వ్యయం ఇంకా తక్కువ ఉండాల్సింది. విదేశీ ప్యానెల్స్ వాడే వెసులుబాటే కాదు ఆంధ్రప్రదేశ్‌లో భూముల స్థితిగతులు కూడా సౌరవిద్యుత్‌కు మరింత సానుకూలమని నిపుణులంటున్నారు. సోలార్ ప్రాజెక్టుల్లో ఉపయోగించే కొన్ని రకాల ట్రాకర్స్ అవసరం ఇక్కడ ఉండదని అంటున్నారు. తక్కువ ప్యానెల్స్‌తోనే అధిక ఉత్పత్తి సాధించవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు.

 

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే మెగావాట్ రూ. 4.75 కోట్లకే నిర్మించవచ్చన్నది నిపుణుల అంచనా. దీనికన్నా ఏపీజెన్‌కో ఖరారు చేసిన మొత్తం (మెగావాట్‌కు రూ. 6.26కోట్లు) రూ. 1.51 కోట్లు ఎక్కువ. ఇది 500 మెగావాట్ల ప్రాజెక్టు కాబట్టి ఏపీజెన్‌కో వెచ్చిస్తున్న అదనపు (వృథా) వ్యయం రూ. రూ.755 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రయివేటు కంపెనీల జేబుల్లోకి పంపడానికే ఇపుడు రంగం సిద్ధం చేస్తున్నారు.

 

గత ఏడాది ధరలెందుకు?

ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ ధరలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి. ఈ తగ్గుదల ఇంకా కొనసాగవచ్చని సీఈఆర్‌సీ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) అంచనా వేసింది. ఈనేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి.. అంటే 2016-17కు ఒక మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 5.01 కోట్లు అంచనా వ్యయంగా అది నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సీఈఆర్‌సీ నిర్ధారించిన అంచనా వ్యయం రూ.6.05 కోట్లు గా ఉంది. ఏపీ జెన్‌కో ఇపుడు ప్రయివేటు కంపెనీలకు ఇవ్వబోతున్న మొత్తం ఒక మెగావాట్‌కు రూ. 6.26కోట్లు.. సీఈఆర్‌సీ నిర్ధారించిన ఈ ఏడాది రేటు కన్నా కూడా ఎక్కువే. మరో రెండు నెలల్లో ఆర్థికసంవత్సరం మారిపోతోంది. అపుడు కొత్త ధరలు తెరపైకి వస్తాయి. అందుకే ఆ లోగా ప్రయివేటు కంపెనీలకు హడావిడిగా ఈ కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట.

 

బిడ్డింగ్ పారదర్శకమే : ఆదిశేషు

బిడ్డింగ్ విధానంలో పారదర్శకంగానే వ్యవహరించాం.  సోలార్ పవర్ ప్రాజెక్టులో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) గ్యారెంటీ 21శాతంగా ఉండాలని కోరడం వల్లే  కాంట్రాక్టు వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనూ, ఎన్టీపీసీ చేపట్టిన ఇతర సోలార్ ప్లాంట్లలోనూ  పీఎల్‌ఎఫ్ గ్యారెంటీ  18.2 శాతం మాత్రమే. ఎక్కువ పీఎల్‌ఎఫ్ ఉండటం వల్ల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. ప్రాజెక్టు వ్యయం పెరిగినా, భవిష్యత్‌లో ఎక్కువ విద్యుదుత్పత్తి వల్ల లాభదాయకంగా ఉంటుంది. 

- ఆదిశేషు, సీఈవో, సోలార్ పవర్ కార్పొరేషన్

>
మరిన్ని వార్తలు